భద్రాద్రి జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల ధ్రువీకరణ

కలం, ఖమ్మం బ్యూరో: అగ్రిగోల్డ్ డిపాజిటర్లు (AgriGold Depositors ), బాధితులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ నెల 25 నుంచి కొత్తగూడెంలో అగ్రిగోల్డ్ బాండ్లు, నగదు రసీదుల ధ్రువీకరణ, నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. బాధితుల సౌకర్యార్థం హేమచంద్రపురంలోని జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదివారం తెలిపారు. ​

దీనికి సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎ.రామకాంత్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారని ఎస్పీ పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మండలాల వారీగా రోజుకు మొదటి 250 మంది ఖాతాదారుల పత్రాలను మాత్రమే పరిశీలిస్తారని స్పష్టం చేశారు. సందేహాల నివృత్తి కోసం పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712682128ను సంప్రదించవచ్చని సూచించారు.

తీసుకురావాల్సిన పత్రాలివే..

ధ్రువీకరణకు హాజరయ్యే డిపాజిటర్లు తమ అసలు అగ్రిగోల్డ్ బాండ్లు, రసీదులను కేవలం అధికారుల పరిశీలన కోసం మాత్రమే చూపించాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. వాటిని అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. డిపాజిటర్ జీవించి ఉంటే అసలు బాండ్‌తో పాటు దానిపై సంతకం చేసిన కలర్ జిరాక్స్, ఆధార్, పాన్ కార్డు జిరాక్స్‌లు, మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలన్నారు.

ఖాతా వివరాలు స్పష్టంగా కనిపించే బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, మొబైల్ నంబర్, ఏజెంట్ వివరాలు తీసుకురావాలన్నారు. డిపాజిటర్ మరణించి నామినీ జీవించి ఉంటే, అసలు బాండ్‌తో పాటు నామినీ సంతకం చేసిన కలర్ జిరాక్స్, డిపాజిటర్ మరణ ధ్రువీకరణ పత్రం జిరాక్స్, నామినీ ఆధార్, పాన్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్‌లు, ఫోటో, రేషన్ కార్డు లేదా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందన్నారు.

రసీదు తీసుకోవడం తప్పనిసరి..

డిపాజిటర్, నామినీ ఇద్దరూ మరణించిన పక్షంలో చట్టబద్ధ వారసులు ఇద్దరి మరణ ధ్రువ పత్రాలను తీసుకురావాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. అలాగే ఆధార్, పాన్, రేషన్ కార్డు లేదా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ల అసలు పత్రాలను చూపించి జిరాక్స్ కాపీలతో పాటు, వారసుడి సంతకంతో కూడిన బాండ్ కలర్ జిరాక్స్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, ఫోటో సమర్పించాలన్నారు. డిపాజిటర్ జీవించి ఉండి స్వయంగా రాలేని పరిస్థితుల్లో ఉంటే, డిపాజిటర్ ఇచ్చిన అధికార పత్రంతో పాటు డిపాజిటర్ పత్రాలు, హాజరయ్యే కుటుంబ సభ్యుడి గుర్తింపు కార్డు, కుటుంబ సంబంధాన్ని తెలిపే ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలన్నారు.

ఏజెంట్ల ద్వారా బాండ్లు సమర్పించే వారు ప్రతి అసలు బాండ్‌ను చూపించి, కలర్ జిరాక్స్ ఇవ్వడంతో పాటు ప్రతి బాండ్ గుర్తింపు సంఖ్యను విడివిడిగా నమోదు చేయాలన్నారు. ఏజెంట్ కోడ్ తప్పనిసరిగా పేర్కొంటూ తమ గుర్తింపు, బ్యాంక్ పత్రాలను సమర్పించాలని తెలిపారు. పత్రాలు స్వీకరించిన అనంతరం అధికారుల నుంచి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.

మండలాల వారీగా తేదీలు ఇవే..

​మండలాల వారీగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 25, 26వ తేదీల్లో అల్లపల్లి, 26, 27వ తేదీల్లో అన్నపురెడ్డిపల్లి, నవంబర్ 27 నుంచి డిసెంబర్ 3 వరకు అశ్వాపురం, డిసెంబర్ 3 నుంచి 5 వరకు అశ్వారావుపేట, డిసెంబర్ 5 నుంచి 18 వరకు భద్రాచలం, డిసెంబర్ 18 నుంచి 28 వరకు బూర్గంపహాడ్, డిసెంబర్ 28 నుంచి జనవరి 1 వరకు చండ్రుగొండ మండలాల వారికి ధ్రువీకరణ ప్రక్రియ నిర్వహిస్తారు.

కొత్త సంవత్సరంలో 2027 జనవరి 1 నుంచి 8 వరకు చర్ల, 8 నుంచి 11 వరకు చుంచుపల్లి, 11 నుంచి 18 వరకు దమ్మపేట, 18 నుంచి 23 వరకు దుమ్ముగూడెం, 23 నుంచి 27 వరకు గుండాల, 27 నుంచి 29 వరకు జూలూరుపాడు, జనవరి 29 నుంచి 31 వరకు కరకగూడెం మండలాల బాధితులు హాజరుకావాల్సి ఉంటుంది.జనవరి 31 నుంచి ఫిబ్రవరి 16 వరకు కొత్తగూడెం, ఫిబ్రవరి 16, 17వ తేదీల్లో లక్ష్మీదేవిపల్లి, 17 నుంచి 23 వరకు మణుగూరు, 23 నుంచి 27 వరకు ములకలపల్లి మండలాల వారికి నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 27 నుంచి మార్చి 15 వరకు పాల్వంచ, మార్చి 15 నుంచి 24 వరకు పినపాక, 24 నుంచి 27 వరకు సుజాతనగర్, మార్చి 27 నుంచి ఏప్రిల్ 1 వరకు టేకులపల్లి, ఏప్రిల్ 1 నుంచి 9వ తేదీ వరకు ఇల్లందు మండలాల డిపాజిటర్ల బాండ్లను పరిశీలిస్తారు. బాధితులు తమకు కేటాయించిన తేదీల్లో అన్ని పత్రాలతో హాజరై నమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>