యాదాద్రిలో సంగీత జాతర.. కార్తీకోత్సవాల్లో గానామృతం!

కలం, యాదగిరిగుట్ట: ఓ వైపు వేదమంత్రాల ఘోష.. మరో వైపు భక్తుల గోవింద నామస్మరణ.. వీటన్నింటికీ తోడుగా ప్రముఖ గాయకుల మధుర గాత్రం! కార్తీక మాసంలో యాదాద్రి క్షేత్రం (Yadadri Temple) మరోసారి ఆధ్యాత్మిక వైభవానికి వేదికైంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి కార్తీకోత్సవాల్లో భాగంగా మాడవీధుల్లో నిర్వహించిన సంగీత విభావరి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ ఆధ్వర్యంలో సాగిన ఈ సంగీత వేడుక యాదాద్రి ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వామి వారి భక్తి గీతాలను ప్రముఖ గాయకులు ఆలపిస్తుంటే మాడవీధులన్నీ సంగీతమయంగా మారాయి. మధురమైన గాత్రాలు, అద్భుతమైన వాద్య సంగీతం భక్తులను కట్టిపడేశాయి. ప్రతి పాటలోనూ భక్తి భావం ఉట్టిపడగా, స్వామివారి దివ్య మహిమలను కీర్తిస్తూ సాగిన గాన విభావరి భక్తులకు మరపురాని అనుభూతిని అందించింది.

ప్రముఖ కళాకారుల సందడి..

ఈ సంగీత విభావరిలో ఆర్.పి.పట్నాయక్‌తో పాటు ప్రముఖ గాయకులు నిహాల్, నిత్య సంతోషిణి, గోపికా పూర్ణిమ, శ్రీనిధి, మల్లికార్జున్, జర్నలిస్టు స్వప్న తమ గానంతో అలరించారు. వాద్య బృందం సహకారం కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకురాగా, పరంపర సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కార్తీక మాసంలో భక్తులకు కేవలం దర్శనమే కాకుండా ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుభూతులను అందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ సంగీత విభావరి విశేష ఆదరణ పొందింది. భక్తి సంగీతాన్ని ఆలయ మాడవీధుల్లోకి తీసుకొచ్చిన ఈ కార్యక్రమం యాదాద్రి కార్తీకోత్సవాల్లో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది. నరసింహుడి సన్నిధిలో సంగీతామృతం కురిపించిన ఈ వేడుకతో యాదాద్రి క్షేత్రం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>