కలం, వెబ్‌డెస్క్: ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) ఒక భక్తుడు సుమారు రూ.160 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారు. నవంబర్ 26న తిరుమల ఆలయంలో స్వామివారికి ఈ కానుకలను సమర్పించనున్నట్లు ప్రభుత్వ, తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాలు శనివారం వెల్లడించాయి.
తొమ్మిది సెట్లుగా రూపొందించిన మొత్తం 45 ఆభరణాల విలువ సుమారు రూ.150 కోట్ల నుంచి రూ. 160 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీనికి సంబంధించి సదరు భక్తుడు ఇప్పటికే టీటీడీ అధికారులతో సంప్రదింపులు పూర్తి చేశారని, ఆలయంలోనే దేవస్థానానికి వీటిని అందజేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తిరుమల శ్రీవారి చరిత్రలో ఒక వ్యక్తిగత భక్తుడు సమర్పిస్తున్న అతిపెద్ద విరాళం ఇదే కావడం విశేషం. ఈ విరాళాన్ని సీఎం చంద్రబాబు సమక్షంలో సమర్పిస్తారని కూడా చర్చ నడుస్తోంది.

