కలం, మెదక్ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా అభివృద్ధి గురించి మాట్లాడకుండా, కేవలం ప్రతిపక్ష నేతలపై తిట్ల పురాణం ఎత్తుకుంటున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ (Chinta Prabhakar), అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ..మూడేళ్లుగా ముఖ్యమంత్రి ఏ సభకు వెళ్లినా తిట్లు తప్ప మరేమీ ఉండటం లేదని చింతా ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన సీఎం సభకు అసలు జనమే రాలేదని విమర్శించారు. సీఎం సభలో ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని అన్నారు. సీఎం మాటలు ‘తుపాకీ రాముడి’లా ఉన్నాయని, సంగారెడ్డి పర్యటనలోనూ అదే తీరును ప్రదర్శించారని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి తీరు చూసి సొంత పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు. కనీసం ‘ఇందిరమ్మ బీమా’ పథకం గురించి కూడా ప్రస్తావించడం మరిచి, కేవలం కేసీఆర్, హరీష్ రావులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. సాధారణంగా ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి వస్తే అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తారని నాయకులు, ప్రజలు ఆశిస్తారని, కానీ రేవంత్ రెడ్డి మాటలు ‘ఆత్మస్తుతి.. పరనింద’ అన్నట్లుగా ఉన్నాయని చంటి క్రాంతి కిరణ్ విమర్శించారు. ఎల్నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల గురించి సీఎంకు పట్టదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత ధోరణితో వ్యవహరించి సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేసిందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులపై సీఎంకు నిజంగా ప్రేమ ఉంటే, వారికి తగిన పదవులు ఇచ్చి గౌరవించాలని హితవు పలికారు. గతంలో కేసీఆర్ శంకరమ్మను తన తోబుట్టువులా చూసుకున్నారని గుర్తు చేశారు. సీఎం సభలకు ప్రజలు ప్రేమతో రావడం లేదని, రేవంత్ రెడ్డి ఇకనైనా తన అనాలోచిత నిర్ణయాలు మానుకోవాలని హితవు పలికారు. ఈసారి అధికారం కోల్పోతే మరో 20 ఏళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదని క్రాంతి కిరణ్ స్పష్టం చేశారు.

