కలం, వరంగల్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలన్నదే ప్రజల ఆకాంక్షగా ఉందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం వరంగల్(Warangal) కేడీసీ గ్రౌండ్లో నిర్వహించనున్న కేటీఆర్ జన చైతన్య సభకు తొలుత 20 వేల మందిని అంచనా వేసినా..ప్రజల స్పందన చూస్తుంటే అంతకుమించి హాజరయ్యే అవకాశం ఉందని వారు ధీమా వ్యక్తం చేశారు. సభా ఏర్పాట్లను మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, తదితరులు పరిశీలించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, రైతులు సాగునీరు, విద్యుత్ సమస్యలు, పట్టణ ప్రజలు తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుత ప్రభుత్వంలో నిలిచిపోయాయని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కంటే రాజకీయ విమర్శలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో నాయకులు, ఎమ్మెల్యేల మధ్య అంతర్గత అసంతృప్తి పెరుగుతోందని, పలువురు నేతలు, మేధావులు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వరంగల్లో కేటీఆర్ సభ నిర్వహించడం చారిత్రక ప్రాధాన్యత కలిగిన విషయమని బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే సభ లక్ష్యమని, రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. సభకు కార్మికులు, కర్షకులు, యువత, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

