కోరుట్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు: మంత్రి అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేస్తున్న ఆరోపణలకు ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లి (Metpally) పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో కోరుట్ల నియోజకవర్గానికి నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల (Cheyutha Pension) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, ఎన్నికల హామీల్లో భాగంగా ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేస్తున్నామని, త్వరలోనే మిగిలిన రెండు గ్యారంటీలను కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట సభలో పేదల సంక్షేమం కోసం ‘ఇందిరమ్మ బీమా’ పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. కోరుట్ల నియోజకవర్గంలో కొత్తగా 3,737 చేయూత పింఛన్లను మంజూరు చేశామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. సాంకేతిక కారణాలు, సదరం సర్టిఫికెట్ల జారీలో ఉన్న ఇబ్బందులను అధికారులు ప్రత్యేక చొరవతో పరిష్కరించి అర్హులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

నియోజకవర్గంలో ఇప్పటివరకు 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, త్వరలో మరో 2,000 ఇళ్లు మంజూరు చేయిస్తామని తెలిపారు. కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలతో పాటు 70 గ్రామాల అభివృద్ధికి సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. రాజకీయ వివాదాల కంటే అభివృద్ధి వార్తలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జూవ్వాడి నర్సింగరావు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>