కలం, జోగులాంబ గద్వాల: అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వర్తిస్తుందని, రూ.5 లక్షల బీమా ఆర్థిక భరోసాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Rizwan Basha Shaik) అన్నారు. శుక్రవారం గద్వాల మున్సిపాలిటీలోని జమ్మిచేడు 4, 5వ వార్డుల వార్డు కార్యాలయంలో నిర్వహించిన బీమా దరఖాస్తుల స్వీకరణ శిబిరంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. నమోదు ప్రక్రియలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు తొలుత రేషన్ కార్డు కలిగిన కుటుంబాల వివరాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
రేషన్ కార్డులోని కుటుంబ సభ్యుల వివరాల ఆధారంగా నమోదు ప్రక్రియ చేపడతారని కలెక్టర్ వివరించారు. తదుపరి దశల్లో రేషన్ కార్డులు లేని అర్హులైన కుటుంబాలకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. కాబట్టి ప్రస్తుతం రేషన్ కార్డు లేని కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నమోదు కేంద్రానికి వెళ్లేటప్పుడు రేషన్ కార్డు నెంబర్ తెలియజేస్తే సరిపోతుందని, జిరాక్స్ పత్రాలు అవసరం లేదని తెలిపారు.
నెల రోజుల పాటు నమోదు ప్రక్రియ..
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పట్టణ ప్రాంతాల్లో సంబంధిత వార్డు కార్యాలయాలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక నమోదు శిబిరాల ద్వారా ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని వివరించారు. ప్రజలు తమకు కేటాయించిన నమోదు కేంద్రానికి వెళ్లి అధికారుల సహకారంతో సులభంగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. రైతులకు రైతు బీమా, చేనేత కార్మికులకు నేతన్న చేయూత, గీత కార్మికులకు, మత్స్యకారులకు అమల్లో ఉన్న సంబంధిత బీమా, సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు.
దరఖాస్తుల నమోదులో జాగ్రత్తలు..
బీమా దరఖాస్తులను పూర్తి వివరాలతో, అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులకు సూచించారు. కుటుంబ సభ్యుల పేర్లు, నామినీ వివరాలు, నామినీ వాటా, ఆధార్, రేషన్ కార్డు వివరాలు తదితర సమాచారాన్ని స్పష్టంగా, తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం వహించరాదని, ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ధ్రువీకరించుకోవాలని స్పష్టం చేశారు. వార్డు అధికారులు, మహిళా సంఘాలు, కౌన్సిలర్లు ప్రజలకు ఈ పథకం ప్రయోజనాలను వివరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి కుటుంబానికి పథకం సమాచారం చేరేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నమోదు విధానంపై ప్రజలకు స్పష్టంగా వివరించి దరఖాస్తు చేసుకునేందుకు సహకరించాలని సూచించారు. అర్హులైన కుటుంబాలన్నీ ఈ పథకం పరిధిలోకి వచ్చేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ తదితరులు పాల్గొన్నారు.

