కళాక్షేత్రం కళాకారులకే.. KUDA కార్యాలయం తరలింపు సరికాదు: BRS

కలం, హనుమకొండ: కవులు, కళాకారులు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం (Kaloji Kalakshetram)లోకి కుడా (KUDA) కార్యాలయాన్ని తరలించడాన్ని బీఆర్ఎస్ (BRS) నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ హనుమకొండ (Hanumakonda) జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ మాట్లాడారు.

మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళోజీ ఫౌండేషన్ విజ్ఞప్తి మేరకు నాలుగు ఎకరాల స్థలం కేటాయించి సుమారు రూ.100 కోట్లతో కళాక్షేత్రాన్ని నిర్మించామని, అప్పట్లోనే 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. 1,500 మందికి పైగా సామర్థ్యమున్న ఆడిటోరియంతో నిర్మించిన ఈ భవనాన్ని కళాకారులకే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. సుమారు రూ.5 కోట్లతో అన్ని సౌకర్యాలతో నిర్మించిన కుడా పాత కార్యాలయాన్ని ఖాళీ చేసి, కళాక్షేత్రంలోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

జోరిక రమేష్ మాట్లాడుతూ.. కళాక్షేత్రాన్ని కళాకారులకు అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు కూడా సరైన ఏర్పాట్లు చేయడం లేదని ఆరోపించారు. సామాన్య కళాకారులకు అందుబాటు ధరల్లో వేదిక కల్పించకుండా భారీ అద్దెలు నిర్ణయించడం సరికాదన్నారు. కుడా భూములను ప్రైవేటు వ్యక్తులకు, అనుకూలమైన వారికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను తరచూ మార్చడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

వెంటనే కుడా కార్యాలయాన్ని పాత భవనంలోకి తరలించి, కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తిగా కళాకారులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజాసంఘాలు, కళాకారులు, ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>