కలం, నిజామాబాద్ బ్యూరో: ఇందూరు నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నిధులు విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) డిమాండ్ చేశారు. నిజామాబాద్ 42వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్పెషల్ ఫండ్ విడుదల చేస్తే మరింత అభివృద్ది జరిగే అవకాశం ఉందన్నారు.
రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. తన అంతిమ లక్ష్యం కూడా అదే అని స్పష్టం చేశారు. గత కౌన్సిల్ సమావేశంలో విడుదల చేసిన 20 లక్షల నిధులతో పలు కాలనీలలో రోడ్డు, డ్రైనేజీ, కల్వర్టు ఇతర పనులు ప్రారంభమయ్యాయన్నారు. అలాగే వచ్చే కౌన్సిల్ సమావేశంలో కూడా మరిన్ని నిధులు విడుదల చేయాలన్నారు.
ప్రధానంగా అర్బన్‌కు చెందిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించాలని, స్పెషల్ ఫండ్ విడుదల చేసేలా చూడాలన్నారు. ఇప్పటికే తాను అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, కార్పొరేటర్లు బెల్లాల్ శశాంక్, పసునూరి రాము, మఠం పవన్, బీజేపీ మండల అధ్యక్షుడు ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.

