కలం, యాదగిరిగుట్ట : విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురుకులమే విద్యార్థుల భద్రతకు ప్రశ్నార్థకంగా మారిందా? క్రమశిక్షణకు నిలయంగా ఉండాల్సిన విద్యాసంస్థలోనే కర్రల దాడులు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో( Rajapet Gurukul School) చోటుచేసుకున్న ఘటన విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
పదో తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఎనిమిదో తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడగా, ఇద్దరికి కాళ్లు, చేతులకు ఎముకలు విరిగినట్లు బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. మరో విద్యార్థికి నడుము ప్రాంతంలో తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
దాడి ఒకవైపు.. యాజమాన్యం నిర్లక్ష్యం మరోవైపు!
విద్యార్థులపై దాడి జరిగిన తర్వాత పాఠశాల యాజమాన్యం వ్యవహరించిన తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గాయపడిన చిన్నారులకు తక్షణ వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం చేశారని, కనీసం వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వలేదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఘటన తీవ్రతను బయటకు రాకుండా చూసేందుకు ప్రయత్నించడంతో పాటు, దాడికి పాల్పడిన విద్యార్థులను సమర్థించేలా వ్యవహరించారన్న ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
తల్లిదండ్రులకు తెలియకుండానే ఇంతటి ఘటన జరిగిందా?
ఎనిమిదో తరగతి విద్యార్థి యశ్వంత్‌ది బేగంపేట గ్రామం. అతని తల్లిదండ్రులు కాసుల భానుచందర్, శిరీష ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను చదువుల కోసం గురుకులానికి పంపిస్తే, అక్కడ వారి భద్రతకు భరోసా లేకుండా పోయిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మంగళవారం జరిగిన ఘటనకు సంబంధించిన సమాచారం శుక్రవారం ఉదయం బయటకు రావడం పాఠశాల పర్యవేక్షణ తీరుపై అనేక సందేహాలను రేకెత్తిస్తోంది.
గురుకులంలో విద్యార్థుల భద్రతకు ఎవరు బాధ్యులు?
ఈ ఘటనతో గురుకులంలో చదువుకుంటున్న ఇతర విద్యార్థుల్లోనూ భయాందోళనలు నెలకొన్నట్లు తెలుస్తోంది. రేపు తమ పిల్లలకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే బాధ్యత ఎవరు తీసుకుంటారన్న ప్రశ్న తల్లిదండ్రులను వెంటాడుతోంది. విద్యార్థుల మధ్య క్రమశిక్షణ, భద్రత, పర్యవేక్షణ ఉండాల్సిన చోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం విద్యాశాఖ పర్యవేక్షణపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది.
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలి!
ఈ ఘటనను సాధారణ విద్యార్థుల మధ్య గొడవగా పరిగణించి పక్కన పెట్టకుండా జిల్లా యంత్రాంగం అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని సమగ్ర విచారణకు ఆదేశించాలి. జిల్లా సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు గురుకులాన్ని సందర్శించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలి. దాడికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో తేలితే ప్రిన్సిపల్‌తో పాటు సంబంధిత యాజమాన్య బాధ్యులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.
అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా వ్యవహరించిన తీరుపై కూడా విచారణ జరగాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గురుకులంలో ప్రత్యేక భద్రతా పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి. చదువుల కోసం వచ్చిన చిన్నారులకు గురుకులంలోనే రక్షణ లేకపోతే ఇక భరోసా ఎక్కడ? దాడి చేసిన వారిపై చర్యలు ఎప్పుడు? నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై జిల్లా యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పుడు యాదాద్రి జిల్లా ప్రజల ముందున్న ప్రశ్నలివే!

