కలం, నల్లగొండ : ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు హుందాగా, బాధ్యతాయుతంగా మాట్లాడాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన తన ప్రకటనలో ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించనప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ఉద్దేశించే పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని రాజగోపాల్ రెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు.
అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ, ప్రజావసరాలను విస్మరించే పాలకులను తెలంగాణ ప్రజానీకం, చరిత్ర ఎన్నటికీ క్షమించవని ఆయన (Raj Gopal Reddy) వ్యాఖ్యానించారు. సొంత పార్టీ ప్రభుత్వంలోని ముఖ్య నేతల వ్యవహారశైలిని లక్ష్యంగా చేసుకునే ఆయన ఈ తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా, ధర్మబద్ధంగా, నిజాయితీగా పాలన సాగించేలా ముఖ్య నేతలకు సద్బుద్ధిని, ఆత్మపరిశీలనా జ్ఞానాన్ని ప్రసాదించాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అయితే, ఈ వ్యాఖ్యలు ప్రస్తుత ముఖ్యమంత్రిని ఉద్దేశించినవా లేక గత పాలకులను ఉద్దేశించి అన్నవా అనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వనప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇవి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించినవిగానే కనిపిస్తున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు.
Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. పేరేంటంటే?
Follow Us On : WhatsApp

