వైఎస్సార్ నగర్ భూ వివాదం:పేదల ఇళ్లపై పొలిటికల్ డ్రామా!

కలం, వరంగల్ బ్యూరో: రెండు దశాబ్దాలుగా నివాసం. కష్టపడి కట్టుకున్న సొంతిళ్లు. తమదంటూ ఒక చిరునామా ఏర్పడిందన్న భరోసా. ఇప్పుడు ఆ ఇళ్లపై అనిశ్చితి మేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడు ఖాళీ చేయాల్సి వస్తుందోననే ఆందోళన 160 కుటుంబాలను వెంటాడుతున్నది. కాజీపేట వైఎస్సార్ నగర్‌ (Kazipet YSR Nagar)లోని నాలుగు ఎకరాల భూమి వివాదం వాళ్లను జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నది. ఒకవైపు తమను ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కాలనీవాసుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పేదల పక్షాన పోరాడుతున్నామని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇంకోవైపు ఆ భూమి ఎవరిదో తేల్చాల్సిన అధికారులు మాత్రం ఒక స్పష్టమైన నిర్ణయానికి రాకపోవడం విస్మయం కలిగిస్తున్నది. రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలకు వేదికగా మారినది. అక్కడి పేదలకు తమ ఇళ్లు ఉంటాయో.. ఊడతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది.

ఇంటి నంబర్ల కేటాయించి వసతుల కల్పన

వైఎస్సార్ నగర్ పరిధిలోని 70, 71, 72 సర్వే నంబర్లలోని భూమిలో 160 కుటుంబాలు ఉంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. కాలక్రమేణా ఇంటి నంబర్లు ఇచ్చారు. డ్రైనేజీ, మంచినీటి వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించారు. రెండు దశాబ్దాలుగా జీవనం కొనసాగిస్తున్నారు.

అయితే ఇటీవల కొందరు వ్యక్తులు తామే అసలైన భూ యజమానులని పట్టాలతో ముందుకొచ్చి ఇళ్లను ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఐదారు నెలలుగా ఆందోళనలు చేస్తున్న బాధితులు తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్‌ను కలిసి తమకు న్యాయం చేయాలని, భద్రత కల్పించి పట్టాలు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.

రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉందని..

ప్రస్తుతం ఆ భూముల యాజమాన్యమే వివాదానికి కేంద్రబిందువుగా మారింది. సమాచారం మేరకు 1995 వరకు రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే నమోదై ఉన్నట్లు తెలుస్తున్నది. 1997లో కొందరు వ్యక్తులు హక్కులు కోరుతూ కోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వం మాత్రం మిగులు భూమిగా చూపినట్లు సమాచారం. అదే సమయంలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తున్నది.

ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత స్థానికులు గుడిసెలు ఏర్పాటు చేసుకున్నా తొలినాళ్లలో అధికారులు అభ్యంతరం తెలపలేదు. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు తమదని చెబుతుండగా భూమి ఎవరిదనే ప్రశ్న తెరపైకి వచ్చింది. పాత రెవెన్యూ రికార్డులు, కోర్టు కేసులు, హక్కుల పత్రాలను సమగ్రంగా పరిశీలిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

పార్టీల మధ్య రగిలిన పోరు

వైఎస్సార్ నగర్ వివాదం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఏళ్లుగా ఉంటున్న పేదలకు న్యాయం చేయాలని, శాశ్వత హక్కులు కల్పించాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పేదల ఇళ్లను తొలగించే ప్రయత్నాల వెనుక కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు తమకు సంబంధం లేదని, పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పట్టాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ఇలా పేదల సమస్యను పరిష్కరించాల్సిన పార్టీలే పరస్పర ఆరోపణలతో రాజకీయ వేడిని పెంచుతున్నాయి.

మున్సిపల్ ఎన్నికల వేళ..

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండగా వైఎస్సార్ నగర్ భూముల వివాదం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కాలనీవాసుల మద్దతు పొందేందుకు మూడు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ అంశం ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారనుంది. గతంలో భద్రకాళి ఆలయ పరిసరాల్లో పేదల ఇళ్ల తొలగింపు అంశం రాజకీయ దుమారం రేపింది. ఇప్పుడు వైఎస్సార్ నగర్ వివాదం మరోసారి పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. అయితే ఎవరు ఎవరిపై ఆరోపణలు చేసినా కానీ.. 160 కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపైనే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>