ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హతం!

కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీ పోలీసులు, నోయిడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నసీమ్ దుర్రానీ (Naseem Durrani) ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని కపిల్ మిశ్రా కార్యాలయం వెలుపల సమీర్ అనే యువకుడిని కాల్చి చంపిన కేసులో నసీమ్ దుర్రానీ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

సమీర్ హత్య అనంతరం నిందితుడి కోసం ఢిల్లీ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, నిఘా వర్గాల సమాచారంతో దుర్రానీ ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే నోయిడా ఎస్టీఎఫ్ బృందంతో కలిసి సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నసీమ్ దుర్రానీ తీవ్రంగా గాయపడి మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.

హతమైన గ్యాంగ్‌స్టర్ నసీమ్ దుర్రానీకి నేర చరిత్ర ఉందని, గతంలో అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌ను అంతమొందించేందుకు జరిగిన కుట్రలోనూ ఇతనికి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇందుకోసం భారీ సుపారీ తీసుకున్నట్లు సమాచారం ఉందని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. ఇతనికి దావుద్ ఇబ్రహీం డీ కంపెనీతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఢిల్లీ పోలీసులు, నోయిడా ఎస్టీఎఫ్ వెల్లడించాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>