కలం, ఖమ్మం బ్యూరో: కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు (Kothagudem Police) ఏకకాలంలో ప్రత్యేక నాకాబందీ తనిఖీలు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం సోదాలు చేశారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా కొత్తగూడెం పట్టణంలోని ప్రధాన కూడళ్లు, పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
మరోవైపు పట్టణంలోని పలు లాడ్జిలలోనూ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాడ్జిలలో బస చేస్తున్న వారి గుర్తింపు కార్డులు, చిరునామా వివరాలు, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించారు. లాడ్జిలకు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలను తప్పనిసరిగా రిజిస్టర్లలో నమోదు చేయాలని, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు బస చేసినట్లు గుర్తిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ తనిఖీలకు సహకరించాలని సూచించారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడం, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించి రోడ్డు ప్రమాదాలను నివారించడమే ఈ ప్రత్యేక నాకాబందీ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేసి, శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని డీఎస్పీ కోరారు.

