కలం, ఖమ్మం బ్యూరో: గత ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదంతో 147 జీవో ద్వారా కేటాయించిన 23.2 ఎకరాల భూమిని జర్నలిస్టులకు పంచకుండా మూడేళ్లుగా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో జర్నలిస్టులు (Khammam Journalists) కదంతొక్కారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే – టీజేఎఫ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం ప్రెస్ క్లబ్ నుంచి బైక్ ర్యాలీగా వెళ్లి, జడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల తలరాతలు మారడం లేదని, ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తూ జిల్లాలో ఇప్పటికే 18 మంది జర్నలిస్టులు కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు ఇళ్ల జాగా ఇవ్వరా అని ప్రశ్నిస్తూ, తక్షణమే ఆ భూమిని ప్లాట్లుగా చేసి అర్హులకు అందించాలని డిమాండ్ చేశారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి మాట్లాడుతూ.. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా సమస్య పరిష్కారం కాకపోవడం విచారకరమని, జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వకపోతే త్వరలో ఖమ్మం పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు, మహిళా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

