కలం, మునుగోడు : వి.బి.జి. రాంజీ పథకం (VB-G Ram G Scheme) కింద పనిచేస్తున్న కూలీలకు పని ప్రదేశాల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని, ఏడాదికి 200 రోజుల పని కల్పించి రోజుకు రూ.600 వేతనం చెల్లించాలని సీపీఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో వి.బి.జి. రాంజీ పథకం కింద జరుగుతున్న పనులను కూలీలతో కలిసి సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
గ్రామీణ పేదలకు ఉపాధి పథకం జీవనాధారంగా నిలుస్తోందని, వ్యవసాయ పనులు లేని సమయంలో కూలీల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. అయితే పని దినాలు తక్కువగా ఉండటం, పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలీ వేతనాలు లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని రోజువారీ కూలీని రూ.600కు పెంచాలని, ప్రతి కుటుంబానికి ఏడాదికి కనీసం 200 రోజుల పని కల్పించాలని కోరారు. పని ప్రదేశాల్లో కూలీలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు, చేసిన పనికి సకాలంలో కూలీ చెల్లింపులు జరపాలని డిమాండ్ చేశారు.
వి.బి.జి. రాంజీ (VB-G Ram G Scheme) పథకాన్ని పటిష్టంగా అమలు చేసి గ్రామీణ కార్మికులకు ఉపాధి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కూలీల హక్కుల సాధన కోసం సీపీఎం నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కొంతమందికి ఒక వారం, మరి కొంతమందికి మరో వారం ఇలా పని దినాలు పెడుతున్నారని పని అడిగిన ప్రతి ఒక్కరికి ప్రతిరోజు పని దినాలు కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శిఈరటి వెంకటయ్య, ఉపాధి కూలీలు బుర్కల సైదులు,బండి మీద ఎల్లయ్య, ఓర్సు యాదయ్య,దాసరి ఎల్లయ్య, కడారి మల్లయ్య, కడారి అంజయ్య, వరికుప్పల వెంకన్న, నరసింహ, బండమీది శ్రీను, లింగమ్మ, సరిత, లక్ష్మమ్మ,మమత, రావుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Also Read : సిద్ధిపేటపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తే మంత్రి పదవి: సీఎం రేవంత్
Follow Us On: Youtube

