కలం జోగులాంబ గద్వాల: ఎల్ నినో ప్రభావం, కరెంటు కోతలు, సాగునీరందక ఈ వర్షాకాలంలో జిల్లాలో వరిసాగు (Gadwal Paddy Harvesting) అంతంత మాత్రంగా సాగైంది. సాగు చేసిన వరి నీరు, విద్యుత్తు సమస్యలతో ఎండిపోయి దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయి. గద్వాల జిల్లాలో 95,000 ఎకరాల్లో వరి సాగయింది. గత 15 రోజులుగా కోతలు మొదలయ్యాయి. ఎల్‌నినో ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వరి సాగు తగ్గిన నేపథ్యంలో జిల్లాలో పండించిన ధాన్యానికి డిమాండ్ పెరిగింది. వ్యాపారులు పచ్చి ధాన్యం కొనుగోలు చేసి పక్క రాష్ట్రాలకు తరలించటానికి మొగ్గు చూపుతున్నారు.
దేశవ్యాప్తంగా సన్న వడ్లకు డిమాండ్ పెరగడం జిల్లా రైతులకు కలిసివస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు పండించిన సన్న రకం వడ్లను వ్యాపారులు కల్లాల వద్దకే వచ్చి క్వింటాలు రూ.3,800 చెల్లించి కొంటున్నారు. మంచి ధర వస్తుండడంతో పాటు కల్లాల వద్దనే వ్యాపారులు కాంటా వేయడంతో రైతులు వారికే అమ్ముతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి వడ్లను ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ పెట్టి కొనుగోలు కొనుగోలు చేయడం గమనార్హం.
సన్న రకాలకు పెరిగిన డిమాండ్..
వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం తగ్గడం, సన్న రకాల ధాన్యానికి మార్కెట్లో డిమాండ్ పెరగడంతో ధరలు అనుకూలంగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. వరికోతలు ప్రారంభం నుంచి దళారులు, మద్యవర్తులు రైతుల పొలాల వద్దకు నేరుగా పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలంటే తేమశాతం 17కు వచ్చే వరకు ధాన్యాన్ని ఆరబెట్టాల్సి ఉంటుంది. ఇందుకు సమయం పట్టడంతోపాటు ధాన్యం బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రైవేట్ వ్యాపారులు పచ్చి ధాన్యాన్నే కొనుగోలు చేస్తుండటంతో ధరతోపాటు తూకం కూడా కలిసొస్తుందని రైతులు చెబుతున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టడం, కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండే ఇబ్బందులు లేకపోవడంతో పచ్చి ధాన్యాన్ని నేరుగా విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.
ప్రారంభం కాని ఐకేపీ కొనుగోలు కేంద్రాలు..
జిల్లాలో ధాన్యం కొనుగోలుకు గతంలో 72 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు ఏ ఒక్క గ్రామంలోనూ ప్రారంభం కాలేదు. మరోవైపు వరికోతలు ఊపందుకున్నాయి. కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు దళారులు, రైస్‌మిల్లర్లకు విక్రయించుకుంటున్నారు. వారం క్రితం సన్నాలకు క్వింటాల్‌కు రూ.3,900 పలుకుతోంది.
కర్ణాటకలో ధరల పెరుగుదల..
గద్వాల జిల్లా సరిహద్దులో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో మార్కెట్లలో సన్న ధాన్యానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. ఈసారి రైతులు అధికంగా సన్నరకం ధాన్యం పండించారు. ఆర్ఎన్ఆర్ రకానికి అధిక డిమాండ్ ఉంది. శ్రీరాం గోల్డ్ రకం ధాన్యం రూ.4400 వరకు, ఆర్ఎన్ఆర్ రూ.3700 నుంచి రూ.3,900 వరకు, కేఎన్ఎం సోనా 3200, బీబీటీ రూ.3200 నుంచి రూ.3400 వరకు ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగా ధరలు పలుకుతుండడం, వెంటనే నగదు చేతికి వస్తుండడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారుల వైపు మొగ్గుచూపుతున్నారు.

