కలం, మహబూబ్ నగర్ బ్యూరో: హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కార్యక్రమాల్లో నిర్దేశిత 95–95–95 లక్ష్యాల సాధనకు చేసిన కృషితో మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar)కు ‘సురక్షిత్ జిల్లా’ (Surakshit District)గా గుర్తింపు లభించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన 20 సురక్షిత్ జిల్లాల్లో మహబూబ్‌నగర్‌కు స్థానం దక్కడం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, టీజీసాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. విద్యాసాగర్ ఆదేశాల మేరకు గురువారం కలెక్టరేట్లో ‘సమ్మాన్ సమారోహ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్‌లను టీజీసాక్స్ డిప్యూటీ డైరెక్టర్ (బీఎస్‌డీ) మేఖల, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సత్కరించారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు ఈ గుర్తింపు (Surakshit District) రావడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. సాధించిన ప్రగతిని నిలబెట్టుకుంటూ, ఇదే సమన్వయం, అంకితభావంతో కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రజల్లో హెచ్ఐవీపై అవగాహన పెంపొందించడం, పరీక్షలను విస్తృతం చేయడం, నిర్ధారణ అయిన వారికి సకాలంలో చికిత్స అందించడం, మధ్యలో చికిత్స నిలిపివేసిన వారిని తిరిగి వైద్య సేవల పరిధిలోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
హెచ్ఐవీతో జీవిస్తున్న వారిలో 95 శాతం మందికి తమ హెచ్ఐవీ స్థితి తెలిసేలా నిర్ధారణ చేయడం, నిర్ధారణ అయిన వారిలో 95 శాతం మందికి యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ) అందించడం, చికిత్స పొందుతున్న వారిలో 95 శాతం మందిలో వైరల్ లోడ్‌ను అణచివేత స్థాయికి తీసుకురావడం 95–95–95 లక్ష్యాల ఉద్దేశమని అధికారులు వివరించారు. ఈ లక్ష్యాల సాధనలో జిల్లా కనబరిచిన పురోగతికి గుర్తింపుగా సురక్షిత్ జిల్లాల జాబితాలో స్థానం లభించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీజీసాక్స్ డిప్యూటీ డైరెక్టర్ మేఖల, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శశికాంత్, ఎయిడ్స్, లెప్రసీ కార్యక్రమ అధికారి డాక్టర్ రాజు నాయక్, డీఏపీసీయూ బృందం సభ్యులు, వివిధ వైద్య సేవా కేంద్రాల సిబ్బంది, టీఐ–ఎన్జీఓల ప్రతినిధులు, ఎల్డబ్ల్యూఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Also Read : కాంగ్రెస్ నేతలు తిన్న అవినీతి సొమ్ము కక్కిస్తాం: కేటీఆర్
Follow Us On : WhatsApp

