కలం, జోగులాంబ గద్వాల: జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, గంజాయి సాగు, కల్తీ కల్లు తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఒక్క డ్రగ్ కేసు కూడా నమోదు కాకుండా పటిష్ట నిఘా ఉంచాలన్నారు. మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడైనా గంజాయి లేదా ఇతర నిషేధిత మాదకద్రవ్యాల సాగు, నిల్వ, విక్రయాలు, రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాయచూరు సరిహద్దు ప్రాంతంలోని మండలాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గట్టు, కేటీ దొడ్డి, గద్వాల, ఐజ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలతో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
గంజాయి సాగు చేస్తే పథకాల ప్రయోజనాల నిలిపివేత..
వ్యవసాయ భూముల్లో గంజాయి లేదా ఇతర నిషేధిత మాదకద్రవ్యాలకు సంబంధించిన మొక్కలను సాగు చేస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత భూముల వివరాలను సేకరించి, పోలీస్ శాఖ ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ సాగుకు పాల్పడిన వారిపై కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు నిబంధనల ప్రకారం రైతుబంధు, రైతుబీమా, పెన్షన్లు తదితర ప్రభుత్వ పథకాల ప్రయోజనాల నిలిపివేతకు తగు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలకు సూచించారు. ఈ విషయంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద సాగు కనిపించిన వెంటనే పోలీస్, రెవెన్యూ శాఖలకు సమాచారం అందించాలని తెలిపారు.
కల్తీ కల్లు విక్రయాలపై ప్రత్యేక డ్రైవ్..
కల్తీ కల్లు తయారీలో ప్రమాదకరమైన రసాయనాలు వినియోగిస్తున్నట్లు వచ్చే ఫిర్యాదులపై ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. అనుమతులు కలిగిన కల్లు విక్రయ కేంద్రాల్లో కూడా నిబంధనల ఉల్లంఘనలు జరగకుండా తనిఖీలు చేయాలని, కల్తీ కల్లు తయారీ, విక్రయాలు ఎక్కడ జరిగినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా సరిహద్దు గ్రామాలు, ప్రధాన రహదారులు, అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని సూచించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, గంజాయి సాగు వంటి కార్యకలాపాలపై విశ్వసనీయమైన, నిర్ధారించగల సమాచారం అందించే వారికి రూ.10,000 నగదు బహుమతి అందజేస్తామని కలెక్టర్ ప్రకటించారు.
యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమాలు..
విద్యార్థులు మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా 16 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి విద్యా సంస్థలో యాంటీ నార్కోటిక్స్ అవగాహన కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ రహదారుల వెంట ఉన్న దాబాలు, రెస్టారెంట్లు, టోల్ గేట్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర అనుమానిత ప్రాంతాల్లో పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో రాత్రి వేళల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
బడి మానేసిన పిల్లలపై ప్రత్యేక దృష్టి..
మాదకద్రవ్యాల నిర్మూలనతో పాటు బాల్య వివాహాల నివారణ, పాఠశాలల్లో డ్రాప్అవుట్స్ తగ్గించడం వంటి అంశాలపై కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నాలుగు మండలాల్లో సఖీ కేంద్రాల సిబ్బంది తమ సేవలు విస్తరించాలని, సంబంధిత శాఖల ద్వారా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మాదకద్రవ్యాలు, మద్యం వ్యసనాలకు గురైన వారికి అవసరమైన వైద్య చికిత్స, కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని జాతీయ రహదారుల వెంట ఉన్న రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లలో పరిశుభ్రత, ఆహార నాణ్యత, ఆహార భద్రతా ప్రమాణాలను నిరంతరం తనిఖీ చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీఎస్పీ మొగిలయ్య, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, పోలీస్, ఎక్సైజ్, వ్యవసాయ, రెవెన్యూ, విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

