కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం జిల్లాలో సాఫీగా అమలయ్యేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) సూచించారు. ఈ పథకం అమలు కోసం చేపట్టాల్సిన ఏర్పాట్ల విషయమై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ గురువారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు.
జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్యాలయాలు, మండల కేంద్రాల్లోని గ్రామ పంచాయతీల్లో జీవిత బీమా వివరాల నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఈ నెల 20వ తేదీ నుంచి వివరాల నమోదు చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్ లైన్లో చేయాల్సి ఉన్నందున ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కుటుంబ సభ్యుల వివరాలు, నామినీలు, వయసు, బంధుత్వ వివరాలు సరిగ్గా నమోదు చేయాలని తెలిపారు. ప్రత్యేక శిబిరాలలో హెల్ప్ డెస్క్, కంప్యూటర్, ఆన్ లైన్ సదుపాయం తదితర వసతులు ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు.
వివరాలు నమోదు చేసే ఆపరేటర్లు క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని, ఎంపీడీఓలు నిశిత పర్యవేక్షణ జరపాలని అన్నారు. ఆహార భద్రత కార్డు నెంబర్ ఆధారంగా ఆన్ లైన్లో వివరాలు నమోదు చేసిన తర్వాత బీమా చేసుకున్న వ్యక్తి మొబైల్ ఫోన్ కు సమాచారం వస్తుందని అన్నారు. నామినీల వివరాలు తెలపాల్సి ఉన్నందున బీమా చేసుకునే వ్యక్తి నమోదు శిబిరానికి తప్పనిసరి భౌతికంగా హాజరై వివరాలు అందించాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే నామినీలు రావాల్సిన అవసరం లేదని అన్నారు.
ఎక్కడి నుంచి అయినా సరే ఈ పథకం కింద తమకు అనుకూలమైన శిబిరానికి వెళ్లి వివరాల నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, నగర పాలక సంస్థ సహాయ కమిషనర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

