కలం, జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్లో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల(Cheyutha Pensions) ఉత్తర్వు పత్రాలను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar), మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఫైలేరియా బాధితులకు చేయూత పెన్షన్లు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ త్వరలో పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
జగిత్యాల నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, గుడిసెల్లో నివసిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అర్బన్ హౌసింగ్ కాలనీలో డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని సూచించారు. రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంతో ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, సమస్యలను పరిష్కరించడం లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు పేద కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలు అందని అర్హులు కలెక్టరేట్లోని హెల్ప్ డెస్క్‌ను సంప్రదించి వివరాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, పట్టణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు సతీష్, మున్సిపల్ వైస్ చైర్మన్ జీనత్ పర్వీన్ మున్నా, కౌన్సిలర్లు, అధికారులు, లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

