కలం, వనపర్తి: హెచ్ఐవీ (HIV) నివారణ, నియంత్రణ కార్యక్రమాల్లో మెరుగైన ప్రగతి కనబరిచిన వనపర్తి జిల్లా (Wanaparthy)కు ‘సురక్షిత్’ గుర్తింపు లభించింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో) నిర్దేశించిన 95-95-95 లక్ష్యాల సాధనలో జిల్లా మెరుగైన పనితీరు కనబరిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేటగిరీకి ఎంపికైన 20 జిల్లాల్లో వనపర్తి చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (TGSACS) డిప్యూటీ డైరెక్టర్ పి. మేఖల బుధవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా హెచ్ఐవీ నియంత్రణలో జిల్లాలో సాధించిన ప్రగతిని అధికారులు వివరించారు. హెచ్ఐవీతో జీవిస్తున్న వారిలో 95 శాతం మందికి వ్యాధి స్థితిపై అవగాహన కల్పించడం, నిర్ధారణ అయిన వారిలో 95 శాతం మందికి ఏఆర్టీ చికిత్స అందించడం, చికిత్స పొందుతున్న వారిలో 95 శాతం మందికి వైరల్ సప్రెషన్ సాధించడం ఈ లక్ష్యాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు లభించిన గుర్తింపును కొనసాగించాలని, హెచ్ఐవీ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు పరీక్షలు, చికిత్సలను మరింత విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు.
హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి నిరంతర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ గుర్తింపు సాధనకు కృషి చేసిన డీఎంహెచ్వో డాక్టర్ భాస్కర్ నాయక్తో పాటు వైద్య సిబ్బంది, కౌన్సిలర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఆర్టీ కేంద్రాల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్ర మోహన్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

