స్వామినాథన్ సిఫార్సుల అమ‌లుకు ఏఐకేఎస్ డిమాండ్‌

కలం, నల్గొండ: రైతాంగ హక్కుల పరిరక్షణ, వ్యవసాయ రంగ సంక్షోభం పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని అఖిల భారత కిసాన్ సభ (AIKS) జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే, నూతన ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని విమర్శించారు. నల్గొండ పట్టణంలోని సారంపల్లి మల్లారెడ్డి నగర్‌లో( గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్‌లో) బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.తెలంగాణ కిసాన్ సభ ఆధ్వర్యంలో నల్గొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు నిర్వహించిన 36వ అఖిల భారత మహాసభలు విజయవంతమయ్యాయని అన్నారు. 1946-51 మధ్య సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు ప్రధాన కేంద్రాలుగా నిలిచాయని గుర్తుచేశారు.

గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జయంతి నవంబర్ 15న మహాసభలు ప్రారంభమయ్యాయని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి  వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొని రైతాంగ సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారని పేర్కొన్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో రైతులు తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. కరువు, ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయిన 342 జిల్లాల రైతులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. వారికి వడ్డీ లేని రుణాలు, ఉచిత విత్తనాలు, సబ్సిడీలు కల్పించాలన్నారు. ఆహార పంటలకు ఎకరాకు రూ.30 వేలు, వాణిజ్య పంటలకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. 2020-21లో రైతులు ఏడాది పాటు సాగించిన చారిత్రాత్మక ఉద్యమం ఫలితంగానే కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుందని గుర్తుచేశారు. అయినా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ, పంటల బీమా, పెన్షన్ వంటి డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశీయ రైతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలి

రాబోయే కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి అధిక నిధులు కేటాయించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేసి ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధర ప్రకటించాలన్నారు. ఉపాధి హామీ కింద ఏడాదికి 200 రోజుల పని కల్పించి, రోజుకు కనీసం రూ.700 కూలీ చెల్లించాలని కోరారు. ఏఐకేఎస్ 27 రాష్ట్రాల్లో 1.58 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రైతు సంఘంగా కొనసాగుతోందన్నారు.

నూతన నాయకత్వం, కార్యాచరణ

నూతన ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ మాట్లాడుతూ నల్గొండ మహాసభ రైతాంగ ఉద్యమానికి నూతన దిశానిర్దేశం చేసిందన్నారు. మహాసభలో జాతీయ అధ్యక్షులుగా డాక్టర్ అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శిగా విజ్జు కృష్ణన్, ఆర్థిక కార్యదర్శిగా పుష్పేంద్ర త్యాగీ ఎన్నికయ్యారని తెలిపారు. 12 మంది ఉపాధ్యక్షులు, 12 మంది సంయుక్త కార్యదర్శులతో కలిపి 27 మందితో జాతీయ కార్యాలయ బాధ్యుల కమిటీ ఏర్పాటైందన్నారు. కిసాన్ కౌన్సిల్‌కు 167 మంది, కేంద్ర కిసాన్ కమిటీకి 86 మంది సభ్యులను ఎన్నుకున్నట్లు వివరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి పోతినేని సుదర్శన్ (తీగల సాగర్), ప్రభాకర్‌రెడ్డి సంయుక్త కార్యదర్శులుగా ఎన్నికయ్యారని తెలిపారు.

సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు నవంబర్ 26న దేశవ్యాప్త నిరసనలు, డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో కార్మికుల భారీ పోరాటం, ఏప్రిల్ 11 నుంచి పోరాట నిధి సేకరణ చేపట్టాలని మహాసభ నిర్ణయించిందన్నారు. భూమి హక్కుల పరిరక్షణకు ప్రత్యేక ఉద్యమాలు, ఎస్‌ఐఆర్ ప్రక్రియతో 14 కోట్ల మంది ఓటర్ల హక్కులకు ముప్పు ఏర్పడుతుందని, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు పోరాడాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్, కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, కందాల ప్రమీల, ఎం. శోభన్, నల్గొండ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>