కలం, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. అర్హులైన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) భాస్కర్ రావు ఆధ్వర్యంలో బుధవారం అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు (Anganwadi Recruitment) నిర్వహించారు. భువనగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, బొమ్మలరామారం మండలాల్లో ఖాళీగా ఉన్న 3 అంగన్వాడీ టీచర్ పోస్టులకు అర్హత సాధించిన 45 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.
అదేవిధంగా షెడ్యూల్డ్ తెగలకు కేటాయించిన ఖాళీగా ఉన్న 13 ఆయా పోస్టులకు అర్హత పొందిన 22 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. మొత్తం 16 పోస్టుల భర్తీ కోసం 67 మంది అభ్యర్థులు ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. పారదర్శకంగా, అర్హతల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

