కలం, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్రోసూరు మండలంలోని నాగవరం (Nagavaram) తో పాటు మరికొన్ని గ్రామాలలో నేడు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ తరుణంలో బయటి ప్రాంతాల నుంచి వచ్చిన అల్లరిమూకలు అలజడి సృష్టించేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది.
నామినేషన్ల ప్రక్రియను అడ్డుకునేందుకు బయటి ప్రాంతాల నుంచి కొందరు కిరాయి మనుషులు మారణాయుధాలతో నాగవరం గ్రామంలోకి ప్రవేశించారు. ఈ విషయమై క్రోసూరు పోలీసులకు ముందస్తు సమాచారం అందడంతో తక్షణమే అప్రమత్తమయ్యారు. నాగవరం గ్రామంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మారణాయుధాలతో సంచరిస్తున్న పలువురు కిరాయి మనుషులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా వారు ప్రయాణించడానికి ఉపయోగించిన ఒక అశోక్ లేలాండ్ వాహనం, మరికొన్ని కార్లను పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న వాహనాలను విచారణ నిమిత్తం క్రోసూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

