కలం, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో విషాదం (Melbourne drowning) చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన 32 ఏళ్ల రబియా బేగం, ఆమె రెండున్నరేళ్ల కుమారుడు అబ్దుల్లా అబ్బాస్ నవంబర్ 17న ఓ కాలువలో మునిగి మృతి చెందారు. మెల్బోర్న్ ఉత్తర ప్రాంతంలోని క్రెయిగీబర్న్లో, ఐట్కెన్ బౌలేవార్డ్ సమీపంలోని మాల్కమ్ క్రీక్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది.
కుటుంబ సభ్యులందరూ కలిసి గోల్డెన్ సన్ మాత్ పార్క్ సమీపంలో వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో రెండున్నరేళ్ల అబ్దుల్లా అబ్బాస్ ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న కాలువలోకి జారిపడ్డాడు. నీటిలో మునుగుతున్న కుమారుడిని కాపాడేందుకు తల్లి రబియా బేగం వెంటనే కాలువలోకి దిగింది.
అయితే నీటి ప్రవాహం, లోతు ఎక్కువగా ఉండటంతో తల్లీకొడుకులు ఇద్దరూ నీట మునిగిపోయారు. సమాచారం అందుకున్న అత్యవసర సేవల సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని వారిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రబియా భర్త, మూడేళ్ల కుమార్తె కన్నీరుమున్నీరవుతున్నారు.

