యువకుడి హత్యపై ముగ్గురు మంత్రులు బాధ్యత వహించాలి: రేగా కాంతారావు

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం పట్టణంలో నడిరోడ్డుపై యువకుడిని కొట్టి చంపడం రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు నిదర్శనమని పినపాక మాజీ ఎమ్మెల్యే, మాజీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు (Rega Kantha Rao) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సత్యసాయి రెసిడెన్సీ వద్ద ఆధార్ కార్డు విషయంలో తలెత్తిన చిన్నపాటి వివాదంతో అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామానికి చెందిన తెల్లం శరత్‌ను బయటకు లాక్కొచ్చి కొట్టి చంపడం అత్యంత అమానవీయమని మంగళవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

​పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో గత కొంతకాలంగా గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం, పేకాట, అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నా పోలీసు యంత్రాంగం అరికట్టడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. ఇంతటి దారుణ ఘటన జరిగినా స్థానిక ఎమ్మెల్యే కనీసం స్పందించకపోవడం విచారకరమన్నారు. జిల్లాలో ఇసుక, డ్రగ్స్ మాఫియాలపై ఉదాసీనంగా వ్యవహరిస్తూ జేబులు నింపుకుంటున్న జిల్లాలోని ముగ్గురు మంత్రులు ఈ యువకుడి మృతికి నైతిక బాధ్యత వహించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

​ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులతో పాటు సత్యసాయి రెసిడెన్సీ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రేగా కాంతారావు కోరారు. పట్టణంలోని లాడ్జిల్లో వెంటనే ప్రత్యేక తనిఖీలు చేపట్టి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయకపోతే, ప్రజల భద్రత కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>