ఏడు రంగాల్లో బహుముఖ పోరాటానికి ఏఐకేఎస్ పిలుపు!

కలం, నల్లగొండ : కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాస్వామిక, లౌకిక శక్తులన్నీ ఏకమై విస్తృత పోరాటాలు నిర్వహించాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ధావలే (Ashok Dhawale) పిలుపునిచ్చారు. కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం కొనసాగితే రైతులు, శ్రామికులు, వ్యవసాయ కార్మికులతో పాటు సమాజంలోని అన్ని వర్గాలపై ఆర్థిక, సామాజిక దాడులు మరింత తీవ్రతరమవుతాయని ఆయన పేర్కొన్నారు.

నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో సోమవారం జరిగిన ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలో (కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి నగర్, కామ్రేడ్ వి.ఎస్. అచ్యుతానందన్ హాల్, కామ్రేడ్ ఎన్. శంకరయ్య వేదికలో) డాక్టర్ అశోక్ ధావలే అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, రైతాంగ సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశీయ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలు అమలవుతున్నాయని, దీనివల్ల అవినీతి కుంభకోణాలు పెరిగి, సామ్రాజ్యవాద శక్తులకు దేశం లొంగిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ ధావలే ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, సంఘ్ పరివార్ శక్తుల రాజకీయ, సైద్ధాంతిక ప్రభావం దేశ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య వ్యవస్థ, సామాజిక-ఆర్థిక న్యాయం మరియు భారత రాజ్యాంగానికి ముప్పుగా పరిణమించిందని ఆయన విమర్శించారు. మతతత్వ, కార్పొరేట్ అనుకూల విధానాలను ఎదుర్కొనేందుకు కేవలం రాజకీయ పోరాటాలకే పరిమితం కాకుండా.. రాజకీయ, సైద్ధాంతిక, ఆందోళనాత్మక, సామాజిక, సాంస్కృతిక–సాహిత్య, మీడియా, సంస్థాగత రంగాలు సహా మొత్తం ఏడు రంగాల్లో బహుముఖ పోరాటాలు నిర్వహించాలని ఆయన సూచించారు.

వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ప్రతిఘటించేందుకు కార్మికవర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మిక సంఘాలు ఐక్య పోరాటాల్లోకి రావాలని ధావలే పిలుపునిచ్చారు. వామపక్ష ఉద్యమాల స్వతంత్ర శక్తిని, ముఖ్యంగా ఏఐకేఎస్ సంస్థాగత బలాన్ని వేగంగా పెంచుకోవాలన్నారు. ఇందుకోసం లెనిన్ ప్రతిపాదించిన ఆందోళన, ప్రచారం, సంస్థ అనే మూడు సూత్రాలను సృజనాత్మకంగా అమలు చేయాలని, ప్రజల సమస్యలను కేంద్రంగా చేసుకుని పనిచేసే ‘మాస్ లైన్’ విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చరిత్రలో నాజీయిజం, ఫాసిజం వంటి శక్తులను వామపక్ష పోరాటాలు ఓడించిన స్ఫూర్తితో, నేడు ప్రజాస్వామిక, లౌకిక శక్తుల ఐక్యతను బలోపేతం చేస్తూ నిరంతర ఉద్యమాలకు సిద్ధం కావాలని మహాసభల వేదికగా ఆయన పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>