కలం, స్పోర్ట్స్: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ప్రస్థానానికి ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రత్యేక స్థానం లభించింది. శరద్ పవార్ క్రికెట్ స్టేడియంలో సచిన్ ‘బ్యాటోగ్రఫీ’ ని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సోమవారం ప్రారభించింది. ఈ ప్రత్యేక విభాగాన్ని సచిన్ స్వయంగా ఆవిష్కరించారు. ఇక్కడ సచిన్ తన కెరీర్లో వినియోగించిన ప్రతి బ్యాట్‌ను ప్రదర్శిస్తారు. 1978 నుంచి 2013లో సచిన్ రిటైర్మెంట్ వరకు ఆయన వాడిన దాదాపు 25 బ్యాట్లను ఇక్కడ ఉంచారు.
ఈ ప్రదర్శనలో ఐదేళ్ల వయసులో సోదరి సవిత బహుమతిగా ఇచ్చిన తొలి కశ్మీర్ విల్లో బ్యాట్ నుంచి, చివరి టెస్టు ఇన్నింగ్స్‌లో వాడిన బ్యాట్ వరకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 17 ఏళ్ల వయసులో తొలి టెస్టు సెంచరీ సాధించిన బ్యాట్, డాన్ బ్రాడ్‌మన్ బహూకరించిన బ్యాట్, 2003 ప్రపంచకప్‌లో ఉపయోగించిన బ్యాట్, 2012లో వందో అంతర్జాతీయ సెంచరీ సాధించిన బ్యాట్ కూడా ఇందులో ఉన్నాయి.
తన 200వ, చివరి టెస్టు ముగిసి 13 ఏళ్లు పూర్తయిన రోజునే ఈ విభాగాన్ని ప్రారంభించడం విశేషం. 2013 నవంబర్ 16న వెస్టిండీస్‌తో వాంఖడే స్టేడియంలోనే సచిన్ తన చివరి టెస్టు ఆడారు. నవంబర్ 17 నుంచి 22 వరకు మ్యూజియం, మ్యూజియం-స్టేడియం టూర్ టికెట్లు డిస్ట్రిక్ట్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పర్యటనలో భాగంగా సందర్శకులు సచిన్ ‘బ్యాటోగ్రఫీ’ని కూడా వీక్షించవచ్చు.
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. 24 ఏళ్ల తన క్రికెట్ ప్రయాణంలో బ్యాట్లు తన శరీరంలో భాగంలా, చేతులకు పొడిగింపులా ఉండేవని, ప్రతి బ్యాట్ తన జీవితంలోని ఒక ప్రత్యేక దశను, మైదానంలోని అనుభూతులను గుర్తుచేస్తుందని చెప్పారు. తన తొలి బ్యాట్ నుంచి చివరి అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లో ఉపయోగించిన బ్యాట్ వరకు అన్నింటినీ ఒకే చోట చూడటం ఆనందంగా ఉందన్నారు.

