కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మండలంలో రూ.5.49 కోట్ల నిధుల వినియోగంపై 16వ విడత సోషల్ ఆడిట్‌కు (Yadagirigutta Social Audit) అధికారులు సిద్ధమయ్యారు. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు చేపట్టిన పనులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను తనిఖీ చేయనున్నారు. ఇందులో కూలీల వేతనాల కోసం రూ.3.90 కోట్లు, మెటీరియల్ ఖర్చుల కోసం రూ.1.60 కోట్లు వెచ్చించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం రూ.5.49 కోట్ల నిధుల వినియోగంపై రికార్డుల పరిశీలనతో పాటు క్షేత్రస్థాయి వివరాలను సేకరించనున్నారు.
ఉపాధి హామీ పథకం కింద ఖర్చయిన కోట్లాది రూపాయల నిధులకు ఇక లెక్క చెప్పాల్సిందేనా? పనులు ఎక్కడ జరిగాయి? కూలీలకు వేతనాలు సక్రమంగా అందాయా? మెటీరియల్ ఖర్చులు నిబంధనల ప్రకారమే జరిగాయా? అనే అంశాలు ఇప్పుడు సామాజిక తనిఖీలో కీలకం కానున్నాయి. ఈ తనిఖీలకు సంబంధించి యాదగిరిగుట్ట మండల పరిషత్ కార్యాలయంలో VB-GRAMG సిబ్బంది, సోషల్ ఆడిట్ బృందం మధ్య సమన్వయ సమావేశం నిర్వహించారు. తనిఖీల ప్రక్రియ, రికార్డుల అందుబాటు, సిబ్బంది బాధ్యతలు, క్షేత్రస్థాయి సమన్వయంపై చర్చించారు.
కోట్ల నిధులు ఖర్చు.. క్షేత్రస్థాయిలో పనుల పరిస్థితి ఏమిటి? అన్నది ఈ సోషల్ ఆడిట్లో ప్రధానంగా అధికారులు పరిశీలించనున్నారు. ప్రజాధనం వినియోగంపై పారదర్శకత పెరగాలంటే కాగితాలపై ఉన్న లెక్కలతో పాటు క్షేత్రస్థాయి వాస్తవాలు కూడా సరిపోలాలి. తనిఖీల్లో ఏవైనా అవకతవకలు లేదా నిబంధనల ఉల్లంఘనలు బయటపడితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సమావేశంలో APO లింగంపల్లి నర్సయ్య, EC రాజశేఖర్, SRP అజ్మీరా రమేష్ బాబు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, BRPలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, VRPలు పాల్గొన్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సోషల్ ఆడిట్ నివేదికపైనే ఉంది. రూ.5.49 కోట్ల ప్రజాధనం వినియోగంపై తనిఖీలు ఎలాంటి వివరాలను వెలుగులోకి తీసుకువస్తాయో వేచి చూడాలి.

