కలం, యాదగిరిగుట్ట : తెలంగాణలో క్రీడా రంగానికి కొత్త ఊపు తీసుకొచ్చే దిశగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026కు (Khelo India) భారీ స్థాయిలో ప్రచారానికి తెరలేచింది. మైదానాలకే పరిమితమైన క్రీడా స్ఫూర్తిని ప్రతి పాఠశాల గడపకు, ప్రతి కళాశాల ప్రాంగణానికి, ప్రతి యువకుడి ఆలోచనకు చేర్చే లక్ష్యంతో అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించింది. డిసెంబర్ 11 నుంచి 22 వరకు ఎనిమిది ఆతిథ్య జిల్లాల్లోని 20 వేదికలపై జరగనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తెలంగాణ క్రీడా చరిత్రలో మరో కీలక ఘట్టంగా నిలవనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక క్రీడా వేడుకలకు సంబంధించి అధికారిక లోగో, మస్కట్ పోస్టల్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖేలో ఇండియా సందేశం జిల్లాలోని ప్రతి విద్యాసంస్థకు చేరాలని, విద్యార్థులు, యువత పెద్దఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
క్విజ్ నుంచి క్రీడా పరుగుల వరకు..
జిల్లా యువజన, క్రీడల అధికారి కె. ధనంజనేయులు మాట్లాడుతూ.. ఖేలో ఇండియా గ్లోబల్ క్విజ్‌ను ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ, వృత్తి విద్యా కళాశాలల్లో నోడల్ ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులను భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. మస్కట్, ఖేలో ఇండియా ఇతివృత్తంతో చిత్రలేఖనం, డ్రాయింగ్ పోటీలు నిర్వహించడంతో పాటు ఉత్తమ చిత్రాలను క్రీడా వేదికల వద్ద ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, యువజన క్లబ్‌లు, క్రీడా సంఘాల ఆధ్వర్యంలో ఖేలో ఇండియా రన్, వాకథాన్, సైక్లోథాన్ కార్యక్రమాలు ఉంటాయన్నారు. కాగా, నవంబర్ 16 నుంచి డిసెంబర్ 22 వరకు క్రీడా ప్రచార హోరు కొనసాగనుంది.
క్రీడలు అంటే కేవలం పతకాలు సాధించడం మాత్రమే కాదు.. యువతలో ప్రతిభను వెలికితీయడం, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కూడా అని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. ఈ లక్ష్యంతో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రేక్షకులుగా ఉన్న యువత.. ఇక క్రీడా చైతన్యానికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ క్రీడా ప్రతిభను జాతీయ స్థాయిలో చాటిచెప్పే ఈ వేడుకలో ప్రతి విద్యార్థి, ప్రతి యువజన సంఘం భాగస్వామి కావాలన్నదే అధికారుల ప్రధాన లక్ష్యం అని చెప్పుకొచ్చారు.

