కలం, మహబూబ్ నగర్ బ్యూరో: బాలానగర్ (Balanagar) లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల (Ekalavya Model School) ను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో మాట్లాడి వారి చదువులు, విద్యా ప్రగతి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తనిఖీ సమయంలో పలువురు ఉపాధ్యాయులు ఎటువంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, విధులకు అనధికారికంగా గైర్హాజరైన సంబంధిత ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేసి, వారి నుంచి వివరణలు కోరాలని సంబంధిత ఆర్సీఓ ను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఆయన సూచించారు.

