కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో (Private Hospitals) రోగుల నుంచి వైద్య పరీక్షలు, చికిత్సల పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలంగాణ జనతా పార్టీ (టీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్(Kuthadi Shivaraj) పేర్కొన్నారు. కొన్ని ఆసుపత్రుల్లో రోగులకు అవసరం లేని వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, లేని వ్యాధులను ఉన్నట్లు చెబుతూ ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్య సమస్యలతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే, వైద్యం పేరుతో లక్షల కొద్దీ భారీ బిల్లులు విధించడం వల్ల అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సేవలు వ్యాపారంగా మారకుండా ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని కోరారు.
కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అవినీతి మత్తులో మునిగిపోయారని, ప్రైవేటు ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, వైద్య పరీక్షల ధరలు, చికిత్సల బిల్లులు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించాలని శివరాజ్ (Kuthadi Shivaraj) కోరారు. రోగులను అనవసర పరీక్షలకు గురిచేస్తూ, తప్పుడు వైద్య నిర్ధారణలు చేస్తున్న వైద్యులు, ప్రైవేటు ఆసుపత్రుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని జైలుకు పంపడంతో పాటు ఆసుపత్రులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. విచారణలో ఆరోపణలు నిర్ధారణ అయితే సంబంధిత ఆసుపత్రుల యాజమాన్యాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల అనుమతులను రద్దు చేసి సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే విధానాలను సహించేది లేదని, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందే వరకు తెలంగాణ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మొగురం మిరియా, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కాశిపాక అజయ్, జిల్లా ఉపాధ్యక్షుడు బెజ్జంకి అంజయ్య, తడిగొప్పుల వినోద్ కుమార్, కొమురయ్య ముదిరాజ్, ఉపేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : భారత్ వ్యతిరేక సమ్మిట్.. రామచందర్ రావు ఫైర్
Follow Us On: X(Twitter)

