కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సమ్మిట్ భారత్‌కు వ్యతిరేకంగా జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమ్మిట్‌లో భాగంగా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఇటలీ దేశానికి చెందిన జియోకోమో ఫిలిబెక్‌ను మరోసారి ఇండియాకు రాకుండా నిషేధించాలని శంషాబాద్‌లోని విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇటలీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఫిలిబెక్ ఇండియాకు వచ్చి.. భారత ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడమేంటన్నారు. ఇది వీసా రూల్స్‌కు విరుద్ధమన్నారు. గల్ఫ్ దేశాల్లో ఇలా చేసి ఉంటే.. కాల్చి పారేసేవారన్నారు. ఫిలిబెక్ అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే రాహుల్ గాంధీ చప్పట్లు కొడుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి నవ్వారని మండిపడ్డారు. ఇది దేశ వ్యతిరేక చర్యలే అన్నారు.
విదేశీయుల జోక్యం సహించబోం..
వరుస ఎన్నికలతో ఓడిపోయి అసహనంతో రగిలిపోతున్న రాహుల్ గాంధీ.. విదేశీయుల సాయం కోరుతున్నారని రామచందర్ రావు మండిపడ్డారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి వీసా రూల్స్ తెలియవా.. వచ్చిన విదేశీ ప్రతినిధులకు కూడా తెలియదా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదస్సుకు వచ్చినవారి నేపథ్యం చెక్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని తాము వదిలిపెట్టబోమన్నారు. సాయంత్రం డీజీపీని కూడా కలిసి.. వీరిపై ఫిర్యాదు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. భారత్ గడ్డపై విదేశీయుల జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు.

