కలం, మహబూబ్ నగర్ బ్యూరో : పేదలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అసంఘటిత రంగ కార్మికులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా, పూర్తి పారదర్శకతతో ఆసరా పింఛన్లు (Aasara Pensions) మంజూరు చేసి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్ మండలం మాచన్‌పల్లి గ్రామంలోని ఏఎంఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు పంపిణీ చేశారు.
అంతకుముందు ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలో కొత్తగా అర్హత పొందిన లబ్ధిదారులకు పింఛన్లు అందించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఆధార్ వివరాలు, వయస్సు, దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అర్హులను గుర్తించి పింఛన్లు మంజూరు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అర్హులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పింఛన్ల పంపిణీతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని, లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందని అన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో హామీలు ఇచ్చినా అనేక ప్రాంతాల్లో అమలు చేయలేకపోయిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తోందని చెప్పారు. మండలంలో సుమారు 800 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి నిర్మాణాలు చేపడుతున్నామని, అనేక ఇళ్లలో గృహప్రవేశాలు కూడా జరిగాయని వివరించారు. మండలంలో సుమారు 6 వేల రేషన్ కార్డులను కొత్తగా అందించామని, ప్రస్తుతం మండలంలో రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మార్కెట్లో సన్నబియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఊరటనిస్తోందన్నారు.
ఉచిత విద్యుత్ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గుతోందని, ప్రతి నెలా గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసుకునే అవకాశం లభిస్తోందని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, వ్యవసాయంపై అవగాహన పెంపొందించడం, రాబోయే వాతావరణ పరిస్థితులు, కరువు ముప్పుపై ముందస్తు సూచనలు అందించడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. రైతులు నష్టపోకుండా, మహిళలు ఇబ్బందులు పడకుండా, పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలుకాని అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అమలు చేస్తోందని పేర్కొంటూ, ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతి, మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లపాటు కొనసాగితే తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, మైత్రి యాదయ్య, మాచన్ పల్లి సర్పంచ్ మన్యంకొండ , పోతన్ పల్లి సర్పంచ్ మాధవ రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రాజు గౌడ్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పసుల రాజు, నాయకులు శ్రీనివాస్ యాదవ్, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లు అనిల్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, నాయకులు రాజేందర్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, రామచంద్రయ్య, వెంకటేష్ యాదవ్, గోవింద్ యాదవ్, మేఘారెడ్డి, కోడూరు రవి, కాండం రఘు, వెంకట్ యాదవ్, పోతన్ పల్లి మోహన్ రెడ్డి, నర్సింహ్మారెడ్డి, భాస్కర్ , జి.కృష్ణ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిడిఓ కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.

