కలం, కరీంనగర్: హుస్నాబాద్ (Husnabad) నియోజకవర్గంలో దివ్యాంగులు, వయో వృద్ధులకు ఉచిత సహాయ ఉపకరణాల కోసం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో అలింకో సంస్థ సహకారంతో నిర్ధారణ శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 7 మండలాలు, మున్సిపాలిటీలో దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయక పరికరాల పంపిణీకి అలింకో, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలు ప్రారంభించిందన్నారు. ఈరోజు సైదాపూర్ మండలంలో అలింకో వైద్య శిబిరం ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. 17న ఎల్కతుర్తి, 18న భీమదేవరపల్లి, 20న కోహెడ, 21న చిగురుమామిడిల్లో ఉచిత ఉపకరణాల ఎంపిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
25, 26, 27 తేదీల్లో హుస్నాబాద్ మండలం, పట్టణంతో పాటు అక్కన్నపేటలో నిర్వహణ జరుగుతుందన్నారు. అర్హులైన దివ్యాంగులు, వృద్ధులు శిబిరాలకు హాజరై వైద్య పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు. అవసరాన్ని బట్టి కృత్రిమ కాళ్లు, చేతులు, వినికిడి యంత్రాలు, చంక కర్రలు, చేతి కర్రలు, వీల్చైర్లు, మూడు చక్రాల బండ్లు ఉచితంగా అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 100 శాతం అర్హులైన వారందరికీ సహాయక పరికరాలు అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని సృష్టం చేశారు.
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు..
అర్హులను గ్రామాల నుంచి శిబిరాలకు తీసుకువచ్చి, పరీక్షల అనంతరం తిరిగి గ్రామాలకు చేర్చే బాధ్యతను అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే అర్హులైన వారందరికీ 7 రకాల పెన్షన్లు మంజూరు చేశామని, హుస్నాబాద్ నియోజకవర్గంలో 5 వేలకుపైగా కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. అర్హత ఉండి పెన్షన్ రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, విచారణ జరిపి అర్హులైతే పెన్షన్ మంజూరు చేస్తామని పేర్కొన్నారు. 360 డిగ్రీల వెరిఫికేషన్ అనంతరం రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రాతిపదికన పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
పెన్షన్లు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే నమ్మొద్దు..
పెన్షన్లు ఇప్పిస్తామని డబ్బులు అడిగే దళారులను నమ్మవద్దని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మూడు జిల్లాల పరిధిలో నేటి నుంచే కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుందన్నారు. హుస్నాబాద్లోనూ త్వరలో ప్రత్యేకంగా పెన్షన్ల పంపిణీ నిర్వహిస్తామని, దివ్యాంగులు, వృద్ధులకు సేవ చేసే అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించాలని ఆదేశించారు.
పెన్షన్ లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్
జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. చేయూత పథకం లబ్ధిదారులు ఎలాంటి అపోహలకు గురికావద్దని సూచించారు. అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రతి దరఖాస్తును వ్యక్తిగతంగా పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారుల స్క్రీనింగ్, వివరాల నమోదు కోసం ప్రత్యేకంగా EDM సాంకేతిక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆధార్, సదరం సర్టిఫికెట్లు లేని వారికి వాట్సాప్ ద్వారా ప్రింట్ తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. లబ్ధిదారులకు కౌంటర్ల వారీగా అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారన్నారు. ప్రస్తుత శాంక్షన్ లిస్ట్ తర్వాత డిసెంబర్లో రెండో విడత కింద దశలవారీగా వెరిఫికేషన్ జరపనున్నట్లు తెలిపారు. MPDO స్థాయిలో తిరస్కరించిన దరఖాస్తులపై DRDO స్థాయిలో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు.
కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే సుమారు 14 వేల మందికి స్క్రీనింగ్ పూర్తి చేసి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. కొత్త దరఖాస్తులతో పాటు గతంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. DRDO, ACL, కలెక్టర్ స్థాయిలో దరఖాస్తుల పరిశీలన, పరిష్కారంపై పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఎంతో మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా , జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, అలింకో సంస్థ ప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

