కలం, వెబ్ డెస్క్: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయం (Sabarimala Temple) దర్శనం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. మండల మకరవిళక్కు తీర్థయాత్ర సందర్భంగా సాయంత్రం 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. సంప్రదాయం ప్రకారం, మొదట ఆలయాన్ని అత్యంత పవిత్రమైన జలాలతో శుద్ధి చేస్తారు. అనంతరం స్వామి వారికి పూజా కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ప్రతి రోజు 8 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించాలని బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచే భక్తులను నిలక్కల్ నుంచి పంపా వరకు వెళ్లేందుకు అనుమతించనున్నారు. వర్చువల్ క్యూ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవడాన్ని ఈసారి తప్పనిసరి చేశారు. జనవరి 14న మకరవిళక్కు ఉత్సవం నిర్వహించి, జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు.
తెలుగు రాష్ట్రాల నుంచి..
శబరిమల అయ్యప్ప ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు తరలివెళ్తుంటారు. 41 రోజుల పాటు అయ్యప్ప మాల ధరించి మండల దీక్ష చేపడుతుంటారు. అనంతరం ఇరుముడులతో స్వామి వారి దర్శనానికి ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో శబరిమలలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు శాశ్వత భవనం నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేరళను కోరుతున్నాయి. ఇదిలా ఉంటే.. స్వామి వారి పవిత్రమైన ప్రసాదాన్ని ఆన్‌లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం గమనార్హం.

