గ్రేటర్ వరంగల్‌కు ‘స్పెషల్’ గ్రహణం.. సమస్యల్లో జనం!

కలం, వరంగల్ బ్యూరో: గ్రేటర్ వరంగల్‌కు (Greater Warangal) నిధులున్నా.. కానీ ప్రజా సమస్యలను పట్టించుకునే ప్రజాప్రతినిధులే లేరు. పాలకవర్గం, కార్పొరేటర్ల పదవీకాలం ముగియడంతో ప్రజలకు ప్రాతినిథ్యం కరువైంది. వార్డుల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే స్పెషల్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేయడం కష్టతరంగా మారింది. కాలనీల్లో రోడ్లు ధ్వంసమైనా.. డ్రైనేజీలు పొంగిపొర్లినా, నల్లాల్లో నీళ్లు రాకపోయినా సమస్యలకు పరిష్కారం చూపేవారు లేకుండాపోయారు. మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు ముగిసి ఆరు నెలలు దాటింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేదు. గ్రేటర్‌కు నిధులున్నా.. ప్రణాళికలున్నా.. ప్రజాప్రతినిధులు లేని పాలనలో అభివృద్ధి ఏ దిశగా సాగుతుందనే విమర్శలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

సమస్యలపై అడిగేవారు లేక..

గత మే నెలలో కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లింది. ప్రత్యేక అధికారిగా హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, కమిషనర్‌గా టి.వెంకన్న ఉన్నారు. పరిపాలనాపరమైన నిర్ణయాలు, సమీక్షలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వారి పర్యవేక్షణలోనే ఉంది. ప్రజల తరఫున కౌన్సిల్‌లో ప్రశ్నించే కార్పొరేటర్లు లేకపోవడం, డివిజన్ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు చేయించుకునేవారు లేకపోవడం లోటుగా మారింది.

ఒక కాలనీలో రోడ్డు గుంత పడినా, మరోచోట డ్రైనేజీ పొంగినా, తాగునీటి సరఫరా నిలిచిపోయినా స్థానికంగా సమస్యను పట్టుకుని పరిష్కారం కోసం ఒత్తిడి తెచ్చే ప్రజాప్రతినిధి లేరు. 66 డివిజన్లకు వార్డు ఆఫీసర్లు ఉన్నప్పటికీ వారు పన్నుల వసూళ్లు, సంక్షేమ పథకాల అమలుకే పరిమితమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఏ చిన్న సమస్యకైనా ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తక్షణ సవాల్ గా వేసవి నీటి సరఫరా

మరోవైపు వేసవి సమీపిస్తుండగా ప్రజల తాగునీటి అవసరాలు పెరుగుతాయి. రూ.551 కోట్లతో నీటి ప్రాజెక్టుల ప్లాన్ ఉన్నప్పటికీ కార్యాచరణపై ఎలాంటి స్పష్టత లేదు. కార్పొరేషన్లకు తక్షణ సవాల్ తాగునీటి సరఫరా. వేసవిలో నీటి వాడకం పెరగడం, భూగర్భ జలాలు తగ్గడం, కొన్ని ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం సాధారణం. ఆయా పరిస్థితులపై ముందుగానే అంచనా వేసి నీటి వనరుల లభ్యత, పైపులైన్ల మరమ్మతులు, లీకేజీల నివారణ, ట్యాంకర్ల ఏర్పాటు, సరఫరా సమయాలపై కార్యాచరణ రూపొందించాలి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు ఏంటనేది కీలకంగా మారింది.

ప్రతిపక్షాల విమర్శలు

కార్పొరేషన్ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎదురుచూస్తున్నారు. అధికార కాంగ్రెస్ వరంగల్‌ను హైదరాబాద్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని చెబుతూ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీ వంటి భారీ ప్రాజెక్టులను ప్రస్తావిస్తున్నది. ఇటీవల నర్సంపేటలో రూ.532 కోట్ల పనులకు శంకుస్థాపన చేయడం కూడా అభివృద్ధి ఎజెండాలో భాగమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కార్పొరేషన్ లో అభివృద్ధి కుంటుపడిందని, ప్రత్యేక అధికారుల పాలనలో నిర్లక్ష్యంగా తయారైందని బీఆర్ఎస్, బీజేపీ విమర్శిస్తున్నాయి.

మరోవైపు ఎన్నికలు జరగకపోవడంతో పాటు కౌన్సిల్ లేక కేంద్ర ఆర్థిక సంఘం నిధుల విడుదలపైనా ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. 15వ ఆర్థిక సంఘం కింద గత రెండేళ్లలో రాష్ట్రం సుమారు రూ.600 కోట్ల నిధులు నష్టపోయినట్లు అధికారుల అంచనా. ఎన్నికల జాప్యం కూడా నిధులపైనా ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌పై ఎలాంటి స్పష్టత లేక.. ఆశావహులు డివిజన్లలో రాజకీయ సమీకరణాలు మొదలుపెట్టినా, ఎదురు చూడక తప్పడంలేదు.

కొరవడిన జవాబుదారీతనం

2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రేటర్ వరంగల్‌కు (Greater Warangal) రూ.1,040 కోట్ల డ్రాఫ్ట్ బడ్జెట్ రూపొందించింది. వివిధ పనులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.50 కోట్లు మంజూరు చేసింది. మరోవైపు రూ.551 కోట్ల యూఐడీఎఫ్ నిధులతో 4 నీటి శుద్ధి ప్లాంట్లు, 48 కొత్త వాటర్ ట్యాంకుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వీటి అమలు, పనుల పురోగతి, డివిజన్ల వారీగా నిధుల కేటాయింపులపై ఎలాంటి స్పష్టత లేదు. కౌన్సిల్ ఉంటే బడ్జెట్‌పై చర్చ, పనుల ప్రాధాన్యతపై నిర్ణయాలు, అధికారుల పనితీరుపైనా ప్రశ్నించేవారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలో జవాబుదారీతనం కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read : లైంగిక వేధింపులు.. వెటర్నరీ కాలేజీ ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు నమోదు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>