కలం, న్యూఢిల్లీ బ్యూరో: తెలంగాణ వేదికగా డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఎనిమిదో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (Khelo India Youth Games – 2026) లోగో, మస్కట్‌ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆవిష్కరించారు. న్యూఢిల్లీలోని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, క్రీడల ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ డాక్టర్ ఏ. సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా నేతృత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది. ఎనిమిదో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ, లోగో, మస్కట్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఏర్పాట్లను ప్రధానమంత్రికి వివరించింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉందని వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిసెంబర్ 11న జరిగే ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు.
ఈ ఆహ్వానంపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్ర ప్రతినిధి బృందం వెల్లడించింది. యూత్ గేమ్స్ నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు, చూపుతున్న చొరవపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రతినిధి బృందాన్ని అభినందించారు. ఈ క్రీడా సంబరాల ద్వారా దేశ యువ క్రీడాకారులకు తెలంగాణ గొప్ప వేదికగా నిలవనుంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాల్లో గేమ్స్ నిర్వహణకు స్టేడియాలు సిద్ధం చేసినట్లు కేంద్ర మంత్రి మాండవీయకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
27 క్రీడాంశాల్లో 7,000 మందికి పైగా క్రీడాకారులు తలపడనున్నారని తెలిపారు. మూడేళ్లలోనే రాష్ట్ర క్రీడా బడ్జెట్‌ను రూ.113 కోట్ల నుంచి రూ.465 కోట్లకు పెంచినట్లు సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఇప్పటికే 61 మినీ స్టేడియాల నిర్మాణం పూర్తి కాగా, మరో 15 స్టేడియాల పనులు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

