కలం, వెబ్ డెస్క్: పార్లమెంట్ సమావేశాలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలను (Parliament Winter Session) డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ సమావేశాల్లో డీలిమిటేషన్(Delimitation)తో ముడిపడిన మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. ఈ బిల్లు ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి గరిష్టంగా 850కి పెంచాలని కేంద్రం యోచిస్తున్నది. తద్వారా 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే పార్లమెంట్‌తో పాటు రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్నది.
మెజారిటీ కీలకం
ఈ బిల్లుకు అవసరమైన మెజారిటీ సాధించడం కేంద్ర ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే.. సభకు హాజరై ఓటు వేసిన సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల మంది మద్దతు అవసరం. ప్రస్తుతం లోక్‌సభలో మూడు స్థానాలు ఖాళీగా ఉండగా.. మొత్తం 540 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటే బిల్లు ఆమోదానికి 361 ఓట్లు అవసరమవుతాయి. అధికార ఎన్డీయే కూటమికి ప్రస్తుతం 320 మంది సభ్యుల బలం ఉంది. దీంతో బిల్లు ఆమోదం పొందాలంటే ప్రతిపక్షాల మద్దతు కూడా అవసరం. అయితే ఈ బిల్లు పార్లమెంట్లో 15 నుంచి 18 ఓట్ల మెజారిటీతో ఆమోదం పొందుతుందని బీజేపీ ధీమాతో ఉన్నది.
ప్రత్యేక సమావేశాలపైనా ఆలోచన
వర్షాకాల సమావేశాలు ముగిసినప్పటికీ, పార్లమెంట్‌ను కేంద్రం ఇంకా ప్రొరోగ్ చేయలేదు. ఆ సమావేశాలకు కొనసాగింపుగా ప్రత్యేక సెషన్ (Parliament Winter Session) నిర్వహించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తున్నది. లేదంటే ప్రొరోగ్ ఉత్తర్వులు ఇచ్చి, శీతాకాల సమావేశాలు ప్రారంభించవచ్చనే చర్చ జరుగుతున్నది. పార్లమెంట్ సమావేశాలను కొనసాగింపులో ఉంచడం ద్వారా.. స్పెషల్ సెషన్ నిర్వహించాలంటే రెండు రోజుల ముందు నోటీస్ ఇస్తే సరిపోతుంది. కొత్త సమావేశాలను ఏర్పాటు చేయాలంటే కనీసం 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదనేది కీలకంగా మారింది.
Also Read : నేడు సోనియా గాంధీ పుస్తకం ఆవిష్కరణ
Follow Us On: Youtube

