కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minster Ponguleti) పర్యటన సందర్భంగా ఆదివారం రాత్రి ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పండగ వాతావరణం నెలకొంది. వేలాది బైకులతో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు నిర్వహించిన భారీ ర్యాలీతో ఏదులాపురం రహదారులు దద్దరిల్లాయి. పాలేరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రజలు, పార్టీ శ్రేణులు మంత్రికి అపూర్వ స్వాగతం పలికారు.
తిరుమలాయపాలెం మండలం మీదుగా వస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి గొల్లగూడెం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి, అక్కడి నుంచి ఖమ్మం నగరంలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్ వరకు వేలాది బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెపలాడుతుండగా, ‘జై కాంగ్రెస్.. జై ఇందిరమ్మ ఇళ్ల శీనన్న’ అనే నినాదాలతో రహదారులు మార్మోగాయి. దారిపొడవునా పార్టీ శ్రేణుల ఉత్సాహం, అభిమానుల కోలాహలం చూసి ఉత్సాహభరితులైన మంత్రి పొంగులేటి.. తన కారు రూఫ్టాప్పైకి చేరుకుని అందరికీ చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి దగ్గరుండి పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ఈ ర్యాలీని విజయవంతం చేశారు.
అనంతరం టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా మంజూరైన 968 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున ‘చేయూత’ పింఛన్ల మంజూరు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లుగా చేసుకుని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఓవైపు కొత్త పింఛన్ల మంజూరుతో లబ్ధిదారుల ఇళ్లలో ఆనందం నిండగా, మరోవైపు వేలాది బైకుల ర్యాలీతో ఏదులాపురం పరిధిలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మార్కెట్ చైర్మన్ బైరు హరినాధ బాబు, మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కిషోర్ నాయక్, వివిధ డివిజన్ల అధ్యక్షులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

