కలం, ఖమ్మం బ్యూరో: పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వంగా, వారి కన్నీరు తుడవడమే తమ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్తో కలిసి ఖమ్మం జిల్లా ఏదులాపురం (Edulapuram) మున్సిపాలిటీ పరిధిలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో కొత్తగా మంజూరైన 968 మంది లబ్ధిదారులకు ‘చేయూత’ పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో ఒంటరి మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం దీపావళి కానుకగా ఏకకాలంలో 4.5 లక్షల మందికి కొత్త పింఛన్లు అందించిందన్నారు. అలాగే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు డ్వాక్రా సంఘాలకు రూ.73 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందించామని తెలిపారు.
రూ.40 వేల కోట్లతో 8 లక్షల పక్కా ఇళ్లు నిర్మిస్తూ, లంచాలకు తావులేకుండా ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామన్నారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు రూ.500 బోనస్‌తో పాటు 72 వేల ఉద్యోగాల భర్తీ, మరో 14 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని గుర్తుచేశారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, నర్సింగ్ కాలేజీలు, వంద పడకల ఆసుపత్రుల నిర్మాణం వేగంగా సాగుతోందన్నారు.
కలెక్టర్ దివాకర టి.ఎస్ మాట్లాడుతూ.. ఏదులాపురం మున్సిపాలిటీలో ఇప్పటికే 4,700 మంది లబ్ధిదారులు ఉండగా, ఎలాంటి కోటాలు విధించకుండా తాజాగా మరో 968 మందికి కొత్త పింఛన్లు మంజూరు చేశామన్నారు. వృద్ధాప్య పింఛనుదారు మరణిస్తే, ఎలాంటి దరఖాస్తు అవసరం లేకుండానే వారి జీవిత భాగస్వామికి ఆటోమేటిక్‌గా పింఛన్ బదిలీ అయ్యే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. మున్సిపాలిటీలో ఒక్క నెలలోనే రూ.30-40 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కమిషనర్ శ్రీనివాస రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

