ఎరుపెక్కిన నల్లగొండ.. రైతు మహా ప్రదర్శన

కలం, నల్లగొండ: విప్లవాల ఖిల్లాగా పేరుగాంచిన నల్లగొండ జిల్లా కేంద్రం ఎర్రజెండాల రెపరెపలతో, రైతు నినాదాలతో ఎరుపెక్కింది. ఉద్యమాలకు ఊపిరిపోసి.. ప్రజా పోరాటాలకు వేదికైన నల్లగొండ మరోసారి పులకించిపోయింది. అఖిల భారత రైతు సంఘం (AIKS) 36వ జాతీయ మహాసభల సందర్భంగా నల్లగొండ పట్టణంలో ఆదివారం నిర్వహించిన రైతుల మహాప్రదర్శన అట్టహాసంగా.. ఉత్సాహంగా సాగింది. వేలాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు  పాల్గొని తమ ఐక్యతను చాటుకున్నారు.

ఒకప్పుడు పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన వీర తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తిని చాటుతూ నిర్వహించిన ఈ మహాప్రదర్శన చరిత్రలో నిలిచిపోయేలా సాగింది. మర్రిగూడ బైపాస్ నుంచి ఎన్జీ కళాశాల వరకు సాగిన ఈ భారీ ప్రదర్శన రైతాంగ ఐక్యతను, పోరాట స్ఫూర్తిని చాటిచెప్పింది. నాలుగు కిలోమీటర్ల మేర రెండు గంటలకు పైగా సాగిన ఈ ప్రదర్శన పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

ధింసా నృత్యాలు.. కోలాటాలు

రైతాంగ ఐక్యతను చాటుతూ సాగిన ఈ మహాప్రదర్శనలో సంప్రదాయ కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివాసీల సంప్రదాయ ధింసా నృత్యాలు అడుగడుగునా ఉత్సాహాన్ని నింపగా, కోలాటాల లయబద్ధమైన అడుగులు, చెక్కభజనల హోరు, డీజే సప్పుల దరువులతో పట్టణ వీధులు మారుమోగాయి. ప్రదర్శనకు ముందు వరుసలో రెడ్ షర్ట్ వాలంటీర్లు నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రమశిక్షణతో సాగిన వారి కవాతు ఆకట్టుకుంది. ఎడ్ల బండ్ల ప్రదర్శన గ్రామీణ రైతాంగ సంస్కృతిని ప్రతిబింబిస్తూ పట్టణ ప్రజల హృదయాలను దోచుకుంది.

గ్రామీణ వ్యవసాయ సంస్కృతికి అద్దం పట్టిన ఎడ్లబండ్ల ప్రదర్శన, సంప్రదాయ కళారూపాలు, రైతాంగ పోరాట స్ఫూర్తి కలగలిసి మహాప్రదర్శనకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. సంప్రదాయాన్ని, రైతుల సంస్కృతి, గ్రామీణ జీవన విధానం, వ్యవసాయ వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ అలంకరించిన ఎడ్లబండ్లు వీధుల్లో సాగుతుంటే చూపరులు ఆసక్తిగా తిలకించారు.

కార్పొరేట్ వ్యతిరేక నినాదాలు..

కార్పొరేట్ శక్తుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా రూపొందించిన వినూత్న ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వ్యవసాయ రంగంపై కార్పొరేట్ పెత్తనాన్ని ప్రశ్నిస్తూ రూపొందించిన ప్రదర్శనలు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించాయి. కార్పొరేట్ శక్తులకు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తూ అంబానీ, అదానీ, మోదీ పేర్లతో ఏర్పాటు చేసిన భారీ దిష్టిబొమ్మను రైతులు దగ్ధం చేశారు. రైతుల సమస్యలు, కార్పొరేట్ ఆధిపత్యం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై తమ నిరసనను ఈ సందర్భంగా చాటిచెప్పారు.

మహా ప్రదర్శనకు ఘన స్వాగతం..

రైతాంగ అగ్ర నాయకులు ముందుండి నడిపించగా, వేలాదిగా తరలివచ్చిన రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రైతాంగ మహాప్రదర్శనకు నల్గొండ పట్టణంలోని పలు ప్రజాసంఘాలు ఘన స్వాగతం పలికాయి. యూటీఎఫ్, సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ లాంటి ప్రజా సంఘాలు రోడ్డు వెంట నిలబడి ప్రదర్శనకు స్వాగతం పలుకుతూ వారిపై పూలవర్షం కురిపించారు. ఎర్రజెండాల నినాదాలు, కళారూపాలు, రైతాంగ ఐక్యత అఖిల భారత రైతు సంఘం మహాసభలకు ప్రత్యేక ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>