కలం, ఖమ్మం బ్యూరో : అర్హులైన ప్రతి పేదవాడి గడపకు ‘చేయూత’ పింఛను అందిస్తామని, ఇందిరమ్మ ఇళ్ల తుది బిల్లులను ఒక్క రూపాయి లంచం లేకుండా ఈ నెలాఖరులోపు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) స్పష్టం చేశారు. ఆదివారం తిరుమలాయపాలెం మండలం బీరోలు (Beerolu) గ్రామంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.తో కలిసి లబ్ధిదారులకు కొత్త చేయూత పింఛను మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సొంతింటి కలను నెరవేరుస్తోందని తెలిపారు. గత పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు ఖర్చు చేశారే తప్ప పేదల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షలు, హైదరాబాద్ నగరంలో మరో లక్ష.. వెరసి మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను సుమారు రూ.45 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తోందని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో భర్తలు మరణించి సంవత్సరాలు గడుస్తున్నా ఆసరా పింఛన్ల కోసం వితంతువులు ఎదురుచూశారని, అయినా వారికి న్యాయం జరగలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వంలో కుల, మత భేదాలకు తావులేకుండా అర్హులైన వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు భద్రత కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల కొత్త పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. నేడు రాష్ట్రంలో ఎవరిని కదిపినా ప్రజా ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తోందని చెబుతున్నారని అన్నారు.
రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీని విజయవంతంగా అమలు చేశామని మంత్రి పేర్కొన్నారు. ఎకరాకు రెండు విడతల్లో రూ.12 వేల రైతు భరోసాతో పాటు సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. అదేవిధంగా తిరుమలాయపాలెం మండల అభివృద్ధిలో భాగంగా రూ.26.5 కోట్లతో 100 పడకల ఆసుపత్రి, రూ.46 కోట్లతో ఐటీఐ కళాశాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. సిమెంట్ రోడ్ల నిర్మాణం, ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ వైర్ల మార్పు కోసం సుమారు రూ.10 కోట్లు వెచ్చించి పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ఎంపీడీవో సిలార్ సాహెబ్, తహసీల్దార్ లూథన్ విల్సన్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

