కలం, నిర్మల్ : తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరమ్ వర్కింగ్ ప్రెసిడెంట్, నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు పాకాల రాంచందర్ (Pakala Ramchander) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. గత కొంతకాలంగా పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ చేపడుతున్న ఓటు చోరీ కార్యక్రమాల పట్ల తనకు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు గౌరవ పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా వాటి అమలులో ఆశించిన పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు.

