కలం, కరీంనగర్: కరీంనగర్ నగరంలోని ప్రధాన కూడళ్లు, ప్రధాన రహదారులు, రోడ్ల మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాల వద్ద ఎక్కడపడితే అక్కడ అనుమతి లేకుండా ఫ్లెక్సీలు (Illegal Flex Banners) ఏర్పాటు చేస్తున్నా.. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటైన చర్య అని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు (Paidipalli Raju) విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
గత కొంతకాలంగా కరీంనగర్ నగరంలో మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, వాణిజ్య సంస్థలు, పాల డెయిరీలు, విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ప్రధాన కూడళ్లు, జాతీయ నాయకుల విగ్రహాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ సైతం కనిపించకుండా కప్పివేస్తున్నారని, నగర అందాలు బయట ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు కనిపించకుండా పోతున్నాయని తెలిపారు.
రోడ్లపై ఫ్లెక్సీలు కట్టడం వల్ల పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గాలి, వర్షం వచ్చినప్పుడు ఫ్లెక్సీల కారణంగా ప్రమాదాలు జరిగి పలువురు గాయాలపాలవుతున్నారని, ఒక్కోసారి రోడ్డు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారిపై, రోడ్లపై, జాతీయ నాయకుల విగ్రహాల వద్ద, రోడ్ల మధ్యలో ఉన్న పోల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఫ్లెక్సీలు కట్టే వారిపై మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పైడిపల్లి రాజు డిమాండ్ చేశారు.
అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల మున్సిపాలిటీకి లక్షల రూపాయల ఆదాయం గండిపడుతోందని అన్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ వెంటనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, అక్రమంగా, అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని మున్సిపల్ అధికారులను పైడిపల్లి రాజు హెచ్చరించారు.

