హరీశ్ నిజస్వరూపాన్ని సిద్దిపేట ప్రజలకు చూపిస్తాం: ఆది శ్రీనివాస్

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) నిజస్వరూపాన్ని సిద్దిపేట ప్రజలకు చూపిస్తామని ప్రభుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వస్తున్నారని.. ఇందిరమ్మ బీమా (Indiramma Bheema) కార్యక్రమాన్ని సిద్దిపేట వేదిక నుంచి ప్రారంభించబోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా కల్పించబోతున్నామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ బీమాతో పేదలకు ఒక ధీమా కల్పించబోతున్నామని అన్నారు. తమ సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వస్తానని చెప్పడంతోనే హరీశ్ రావు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు సీఎల్పీ మీడియా సెంటర్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.

ఇప్పుడు హరీశ్ రావు వంతు..

సిరిసిల్లకు వస్తానని చెప్పామని.. వచ్చి చూపించామని ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు సునామీ సృష్టించారని కొనియాడారు. సిరిసిల్లలో కేటీఆర్ ఫామ్ హౌస్ వ్యవహారాలను, స్టార్ హోటళ్ల భాగోతాలను సీఎం రేవంత్ బయటపెట్టారని అన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ భయం ఏమిటో చూపించామని.. ఇక ఇప్పుడు హరీశ్ రావు వంతు వచ్చిందని చెప్పారు. తమ మామ కేసీఆర్‌ను అడ్డం పెట్టుకుని సిద్దిపేటలో హరీశ్ రావు పాగా వేశాడని విమర్శించారు. కుమ్మక్కు రాజకీయాల్లో హరీశ్ రావు దిట్ట అని.. ఇతర పార్టీల నాయకులను ప్రలోభపెట్టి సిద్దిపేటలో గెలుస్తూ వస్తున్నాడని ఆరోపించారు.

సభలో మరిన్ని భాగోతాలు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటపై దృష్టి పెట్టారని.. 19 సభతో హరీశ్ రావు పతనానికి కౌంట్‌డౌన్ మొదలవుతుందని ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే హరీశ్ రావు ఫామ్ హౌస్‌లు, గెస్ట్ హౌస్‌లు, రంగనాయక సాగర్ భూముల వ్యవహారాలను బయటపెట్టామన్నారు. మిల్చి మిల్క్ అనే మిల్క్ డెయిరీని పెట్టి ఆంధ్రా విద్యా సంస్థలు, ఆస్పత్రులకు ఎలా పాలు సప్లయ్ చేస్తున్నారో చెప్పామని తెలిపారు. 19 సభలో హరీశ్ రావు మరిన్ని భాగోతాలు బయటకు రాబోతున్నాయంటూ బాంబ్ పేల్చారు.

ఆస్తుల పంపకాల్లో తేడా వచ్చే..

కల్వకుంట్ల కుటుంబంలో ఆస్తుల పంపకాల్లో తేడా వచ్చి కవిత బయటకు వచ్చిందని.. ఆమె హరీశ్ రావును గుంటనక్కగా అభివర్ణిస్తోందని అన్నారు. కవిత నిజాలు చెప్పడాన్ని తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు ఆమెపై విరుచుకుపడుతున్నారని చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్‌మీట్ పెట్టి కవిత పార్టీని రేవంత్ రక్షణ సేనగా అభివర్ణించారని.. అతడిని చూస్తే జాలేస్తుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీలో బలికా బకరా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ దుయ్యబట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>