గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు!

కలం, ఖమ్మం బ్యూరో: గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ముఖ్యంగా విద్య, వైద్యం, రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అధికారులను ఆదేశించారు. భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో కొండరెడ్డి గిరిజనుల జీవన పరిస్థితులు, గ్రామ అభివృద్ధి, మౌలిక వసతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆదివారం ఆయన సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ​గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజులతో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక..

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొండరెడ్డి, గుత్తికోయ గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అటవీ సంపదను పరిరక్షిస్తూనే గిరిజనులకు స్థిరమైన ఆదాయం కల్పించేలా ఉద్యానవన పంటలు, ఆయిల్‌పామ్, జీడిమామిడి, వెదురు, మునగ వంటి పంటల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. అర్హులైన గిరిజనులకు ఉచితంగా మొక్కలు అందించడంతో పాటు డ్రిప్‌ ఇరిగేషన్‌, అంతర పంటల సాగుకు అవసరమైన సహకారం అందించాలని, భూమి యాజమాన్య హక్కులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంటల నుంచి ఆదాయం వచ్చే వరకు గిరిజన కుటుంబాలకు ఉపాధి హామీ పనుల ద్వారా జీవనోపాధి కల్పించాలని, గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.

గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం..

​పూసుకుంట, కట్టుకూరు గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించే అంశంపై స్పందిస్తూ, రోడ్లు భవనాల శాఖ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. గతంలో ఎల్‌డబ్ల్యూఈ నిధుల కింద సుమారు రూ.20 కోట్లతో రహదారి నిర్మాణానికి మంజూరు లభించిన నేపథ్యంలో, ఒక్క చెట్టును కూడా తొలగించకుండా ప్రస్తుతం ఉన్న మార్గాన్ని వినియోగించుకుని రహదారి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ​గ్రామంలోని పాఠశాల పరిస్థితులపై సమీక్షిస్తూ, ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని, పాఠశాల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఐదో తరగతి అనంతరం విద్యార్థులు గురుకుల, ఏకలవ్య తదితర రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఇస్కాన్ సహకారంతో అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. ​

వైద్య సేవలపై మాట్లాడుతూ.. ప్రతి పది రోజులకు ఒకసారి వైద్య శిబిరాలు నిర్వహించాలని, మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా నెలకు రెండుసార్లు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మధుమేహం, రక్తపోటు బాధితులకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించాలని, స్థానికంగా ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించాలని తెలిపారు. అలాగే గ్రామంలో దెబ్బతిన్న ఓవర్‌హెడ్‌ ట్యాంకు స్థానంలో కొత్త ట్యాంకు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించి అర్హులైన వారికి గృహ నిర్మాణ సహాయం అందించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ డిజిటల్ రేషన్ కార్డులు, చేయూత పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అందేలా చూడాలని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించిన సందర్భంలో ఆ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా అందుతుందని వివరించారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి చేతుల మీదుగా నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లకు సంబంధించిన మంజూరు పత్రాలు, డిజిటల్ రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేశారు. అలాగే విద్యార్థులకు అవసరమైన కిట్లను పంపిణీ చేశారు. ​

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఎఫ్‌డీఓ కృష్ణమాచారి, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, గృహ నిర్మాణ పీడీ సవేరం, ఐటీడీఏ ఏవో గన్య, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని పూసుకుంట గ్రామానికి చెందిన కొండరెడ్డి గిరిజన మహిళలు, గ్రామస్తులు మంత్రికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>