కొత్తగూడెం డంపింగ్ యార్డుపై స్థానికుల తిరుగుబాటు

కలం, ఖమ్మం బ్యూరో: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెం పరిధిలోని 11వ డివిజన్ (పాత కొత్తగూడెం) జనావాసాల మధ్య ఉన్న డంపింగ్ యార్డు (Kothagudem Dumping Yard) నుంచి వెలువడుతున్న విషవాయువులతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బాధితుడు కోట రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై శనివారం స్థానికులు డంపింగ్ యార్డు వద్ద చెత్త వాహనాలను అడ్డుకుని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా కోట రమేష్ మాట్లాడుతూ.. కొత్తగూడెం పట్టణ పరిధిలోని 29 డివిజన్ల చెత్తను ప్రతిరోజూ భారీ మొత్తంలో ఇక్కడికి తరలిస్తున్నారని తెలిపారు. డంపింగ్ యార్డు వద్ద కనీస రక్షణ చర్యలు లేకపోవడంతో చెత్త తడిసినప్పుడు, నిప్పు పెట్టినప్పుడు తీవ్రమైన విషవాయువులు వెలువడుతున్నాయని వాపోయారు. ఈ కాలుష్యం కారణంగా స్థానికులు శ్వాసకోశ, చర్మ వ్యాధులతో పాటు విషజ్వరాల బారినపడి నిత్యం ఆసుపత్రుల పాలవుతున్నారని మండిపడ్డారు. తాజాగా తమ కుటుంబ సభ్యులంతా ఈ విషవాయువులు పీల్చి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో పలుమార్లు చెత్త వాహనాలను అడ్డుకున్నప్పుడు పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారని రమేష్ గుర్తుచేశారు. అయితే, ఆ తర్వాత సమస్యను పట్టించుకోకుండా వదిలేశారని విమర్శించారు. ఇప్పటికైనా తాత్కాలిక హామీలతో కాలయాపన చేయకుండా డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

స్థానికుల ఆందోళనతో కార్పొరేషన్ అధికారులు అక్కడికి చేరుకుని ఎప్పటిలాగే సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, శాశ్వత పరిష్కారం చూపే వరకు వెనక్కి తగ్గేది లేదని స్థానికులు స్పష్టం చేశారు. దీంతో సిబ్బంది చెత్త వాహనాలను వెనక్కి తీసుకెళ్లి కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోనే చెత్తతో సహా నిలిపివేశారు. సమస్యను పరిష్కరించకుండా చెత్త వాహనాలను కార్యాలయ ఆవరణలో ఉంచడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని స్థానికులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>