కలం, కరీంనగర్: కరీంనగర్ నగరంలోని 42వ డివిజన్లో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రస్తుత డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనుల పురోగతిని కాంట్రాక్టర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మిగిలిన పనులన్నింటినీ త్వరగా పూర్తి చేసి, నాణ్యమైన సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
అనంతరం యాదగిరి సునీల్ రావు స్థానిక కాలనీవాసులతో మాట్లాడారు. తక్కువ సమయంలోనే అందమైన సీసీ రోడ్డును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడంపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా నిర్మించిన అధునాతన సీసీ రోడ్లు, డ్రైనేజీలతో కాలనీ రూపురేఖలు మారాయని, రాకపోకలకు ఎంతో సౌకర్యవంతంగా మారిందని తెలిపారు. అభివృద్ధి పనులు చేపట్టినందుకు యాదగిరి సునీల్ రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

